రాజశేఖర్ మరణం వెనుక ఇంత దారుణం జరిగిందా..?

ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు రాజశేఖర్ మరణం తమిళ ఇండస్ట్రీని కుదిపేసింది. ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్లంతా కన్నీరు పెట్టుకున్నారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన.. ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు రాజశేఖర్ మరణం తమిళ ఇండస్ట్రీని కుదిపేసింది. ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్లంతా కన్నీరు పెట్టుకున్నారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన.. ఈ మధ్యే చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 8న కన్నుమూసాడు. తమిళ సినీ పరిశ్రమలో దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఈయన. పలైవనచొలై, చిన్నపూవే మెళ్ల పెసు వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు కూడా. భారతీరాజా దర్శకత్వం వహించిన నిజాల్గల్ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో తన ప్రయాణం మొదలు పెట్టాడు రాజశేఖర్.

అయితే ఈయన చనిపోయిన రెండు రోజుల తర్వాత ఇప్పుడు అతడి భార్య సారా ఓ దిగ్బ్రాంతికర నిజాన్ని మీడియా ముందు వెల్లడించింది. తన భర్త కొన్ని రోజుల కిందే శ్వాస సంబంధమైన ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరాడని.. ఆ సమయంలో చికిత్స కోసం కనీసం తమ దగ్గర సరిపడే డబ్బు కూడా లేదని చెప్పింది. కేవలం డబ్బులు లేని కారణంగానే ఆయన ఈ రోజు మన మధ్య లేరు అంటూ కన్నీరు పెట్టుకుంది సారా. రాజశేఖర్ నటిస్తున్న ఓ సీరియల్‌ దర్శకుడు విక్రమ్ ఆదిత్య ఆయన చికిత్స కోసం కొంత ఆర్థిక సాయం చేసారని.. కానీ అది సరిపోలేదని చెప్పింది ఈమె.

తమ దగ్గర కానీ సరిపడా డబ్బులు ఉండుంటే కచ్చితంగా తన భర్త తనతోనే ఉండేవాడని చెప్పుకొచ్చింది సారా. అనారోగ్యం విషమించి చనిపోయారని అంతా అనుకుంటున్న తరుణంలో.. ఇలా డబ్బులు లేక చనిపోయాడని భార్య చెప్పడంతో తమిళనాట అంతా విషాదంలో మునిగిపోయారు. కనీసం ఎవర్నైనా అడిగానా కూడా తామే సాయం చేసి మరీ రాజశేఖర్ ప్రాణాలు కాపాడేవాళ్లం కదా అంటూ వాళ్లు వాపోతున్నారు. ఏదేమైనా కూడా స్పందించాల్సిన తరుణంలో ఏదీ జరగలేదు. దాంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.