దటీజ్ జక్కన.. ఈసారి పక్కాగా ప్లాన్ చేసాడు

ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీయార్ కొమరమ్ భీమ్ పాత్రలో నటిసున్నారు. 2020 జులై 30వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఫైనల్ కాగా ఎన్టీయార్ కోసం ఒక విదేశీ భామ ఎంపికయినట్లు సమాచారం.

ఎన్టీయార్ కు హీరోయిన్ గా మొదట హాలీవుడ్ కు చెందిన డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంపిక చేసారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన డైసీ ఈ సినిమా నుండి తప్పుకుంది. ఆ తరువాత ఎన్టీయార్ కు జోడీగా రాజమౌళి అమెరికాకు చెందిన ఎమ్మా రాబర్ట్స్ ను ఎంపిక చేసాడు. ఎమ్మా రాబర్ట్స్ మొదట్లో ఓకె చెప్పిందని వార్తలు వచ్చినా ఆ తరువాత ఈమె కూడా ఈ సినిమా నుండి తప్పుకుంది. వరుసగా ఇద్దరు హీరోయిన్లు ముందు ఓకె చెప్పి తరువాత ఈ సినిమా నుండి తప్పుకోవటంతో రాజమౌళి ఈసారి సినిమాలో ఎంపికైన హీరోయిన్ వివరాలు వెల్లడించటం లేదని సమాచారం. కొన్ని నెలల తరువాత ఈ కొత్త హీరోయిన్ గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తాడని తెలుస్తోంది. అప్పటిదాకా ఎన్టీయార్ కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరనే విషయంలో సస్పెన్స్ తప్పదు.

దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. చరిత్ర ప్రకారం అల్లూరి సీతారామరాజు, కొమరమ్ భీమ్ కలవకపోయినప్పటికీ వీరిద్దరూ కలిసి పోరాటం చేస్తే ఏ విధంగా ఉంటుందనే ఊహాజనితమైన కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు టాప్ రేంజ్ స్టార్ హీరోలు ఈ సినిమాలో నటిస్తూ ఉండటంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి.