ఈ ఒక్కటి తీసుకుంటే ఇక టోల్ గేట్స్ వద్ద ఆగాల్సిన పనిలేదు

మీకు FASTag ఉందా.. లేదంటే మీ ఫోర్ వీలర్ టోల్ ప్లాజా దాటి వెళ్లలేదు. నవంబరు 30లోగా తీసుకోవాల్సిందే. డిసెంబరు 1నుంచి టోల్ ప్లాజాలో ఉండే లైన్లు FASTag లైన్లుగా మారిపోనున్నాయి. నిమిషాల కొద్దీ లేన్లలో వాహనాలు ఆపి టోల్ ప్లాజా అమౌంట్ కట్టిన తర్వాత వెహికల్ ముందుకు వెళ్లడం కాదు. ఆటోమేటిక్ గా కారు టోల్ ప్లాజా దగ్గరకు రాగానే మన FASTag అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. FASTag అంటే ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్‌. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) టోల్ గేట్ల వద్ద ఫీజు వసూలు చేసే పద్ధతికి స్వస్తి చెప్పాలని ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రయోగాత్మకంగా అహ్మదాబాద్-ముంబై రహదారిపై ఫాస్ట్‌ట్యాగ్ లేన్ ప్రారంభించారు. అక్కడ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో ఇతర జాతీయ రహదారుల్లోని టోల్ గేట్ల దగ్గర ఫాస్ట్ ట్యాగ్ లేన్లను ప్రారంభించింది NHAI. భారతదేశంలోని 500 పైగా టోల్ ప్లాజాల్లో మొదలుపెట్టనున్నారు. డిసెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా వాహనదారుల సేవింగ్స్ అకౌంట్ నుంచి టోల్ ఫీజు చెల్లింపు జరిగిపోతుంది. టోల్ ఛార్జీ చెల్లించేందుకు వాహనాన్ని ఆపాల్సిన అవసరం లేకపోవడంతో రద్దీ కూడా ఉండదు.

ఫాస్ట్‌ ట్యాగ్‌ను టోల్ గేట్ల దగ్గర, బ్యాంకుల నుంచి తీసుకోవచ్చు. పేటీఎం, అమెజాన్ లాంటి యాప్స్, పెట్రోల్ బంకుల్లో కూడా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవచ్చు.