సైరా వెనుక ఇంత కష్టపడ్డారా..? బయటపెట్టిన రత్నవేలు

సౌత్ ఇండియాలో ఎంతోమంది గొప్ప ఛాయాగ్రాహకులు ఉన్నారు. వాళ్లలో రత్నవేలు కూడా ఒకడు. ‘సేతు’, ‘నందా’, ‘ఆర్య’, ‘రోబో’, ‘1 నేనొక్కడినే’, ‘రంగస్థలం’.. ఇలా రత్నవేలు పనితనాన్ని చాటిచెప్పే సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు రత్నవేలు తన కెరీర్లోనే అతి పెద్ద ప్రాజెక్టు అనదగ్గ ‘సైరా’తో పలకరించాడు. ఈ చిత్రంలో రత్నవేలు పనితనం గొప్ప ప్రశంసలందుకుంది. ఈ ప్రశంసల వెనుక మామూలు కష్టం లేదంటున్నాడీ ఏస్ సినిమాటోగ్రాఫర్. తన కెరీర్లో మరే చిత్రానికీ ఇంతగా కష్టపడలేదని అతను చెప్పాడు. ఈ సినిమా కోసం ఎంత శ్రద్ధ, శ్రమ పెట్టింది అతను తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

సినిమా ప్రారంభంలో 18వ శతాబ్దం నాటి లండన్ నగరంలోని స్తబ్దతను చూపించడానికి డల్ కలర్లు వాడానని.. బ్రిటిష్ వాళ్లు మన దేశానికి వచ్చేటపుడు ఇక్కడి సిరి సంపదల్ని, ఆనందాన్ని చూపించడానికి కళ్లకు ఇంపైన రంగులు ఎంచుకున్నానని.. సెకండాఫ్‌లో వచ్చే యుద్ధ సన్నివేశాలకు ముదురు గోదుమ రంగులు వాడానని.. విషాదాంతమైన క్లైమాక్స్‌లో అందరి దృష్టీ చిరు మీదే ఉండేలా చుట్టూ ఉన్న వాటి కలర్స్ బాగా తగ్గించానని చెప్పాడు రత్నవేలు. 250 ఏళ్ల కిందటి కథను ప్రేక్షకులు చూసేటపుడు ఎక్కడా ఎలక్ట్రిక్ లైట్లు వాడిన అనుభూతి కలగకుండాా ఉండేందుకు పగలైతే ఎండా నీడలు, రాత్రయితే వెన్నెల, కాగడాల వెలుగులు ఉన్న భావన కలిగేలా అడుగడుగునా జాగ్రత్త పడ్డట్లు రత్నవేలు వెల్లడించాడు.ఇక బ్రిటిష్ వాళ్లు నరసింహారెడ్డి కోట మీద దాడి చేసే సన్నివేశంలో కనిపించే అందరి మీదా వెన్నెల వెలుగు సమానంగా పరుచుకున్నట్లు ఉండాలని 250 అడుగుల ఎత్తున భారీ లైట్లని వేలాడదీసి షూట్ చేశామని రత్నవేలు చెప్పాడు.

ఇక ప్రి క్లైమాక్స్‌లో వచ్చే యుద్ధ సన్నివేశాన్ని ఏకంగా 70 రోజుల పాటు షూట్ చేసినట్లు అతను తెలిపాడు. జార్జియాలో చిత్రీకరించిన ఈ ఎపిసోడ్‌లో వేలమంది పాల్గొన్నారని.. అందరి స్కిన్ టోన్ ఒకేలా కనిపించాలని కలర్స్ పరంగా ఎంతో శ్రమించామని.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లైటింగ్‌ను మార్చుకుంటూ షేట్ చేయడం వల్ల ఈ ఎపిసోడ్ పూర్తి చేయడానికి 70 రోజులు పట్టిందని రత్నవేలు వెల్లడించాడు.