సింగర్ సునిత ఫస్ట్ చాన్స్ అలా వచ్చిందా..? మొదటి పాటకే హిట్టు కొట్టేసింది

ఏ వేళలోనైనా సునీత పాటలు వింటే మనసుకి ప్రశాంతత లభిస్తుందని శ్రోతలు అంటుంటారు. భక్తి గీతాలు మొదలుకుని సినిమాల్లో పలు గీతాలు ఆలపించిన సునీత మంచి గాయని మాత్రమే కాదు.. వ్యాఖ్యాత, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ కూడా. పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి, ఆయా కార్యక్రమాలకు వన్నె తీసుకొచ్చారు. పలు చిత్రాల్లో సునీత డబ్బింగ్‌ వలన కథానాయికల నటన మరింత ఎలివేట్‌ అయ్యిందంటే అతిశయోక్తి కాదు. పలువురు పరభాషా కథానాయికలకు గొంతు అరువిచ్చి, సినిమాల్లోని ఆయా సన్నివేశాల్లో భావోద్వేగాలను తన గాత్రంతో ప్రేక్షకులకు చేరువయ్యేలా చేశారు.

ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు.. గులాబి సినిమాలోని తొలి పాటతోనే బ్లాక్ బస్టర్ గాయని అయ్యారు.విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సునీత తన లైఫ్ జర్నీ గురించి ముచ్చటించారు.చిన్న వయసులోనే కర్నాటక సంగీతం.. లలిత సంగీతంలో శిక్షణ పొందాను. ఐదేళ్ల వయసుకే త్యాగరాయ సంగీత ఆరాధనోత్సవాలకు హాజరయ్యాను. 8వ ఏట దిల్లీలోని జానపద పోటీల్లో పాల్గొని స్కాలర్ షిప్ సాధించాను. ఆ తర్వాత అనుకోకుండా తెలుగు సినీపరిశ్రమకు పరిచయం అయ్యాను. అసలు తొలి ఛాన్స్ కోసం నేను ప్రయత్నించిందే లేదు. దూరదర్శన్లో ప్రసారమైన నా పాట విని గులాబీ (1995) సినిమాలో పాడే అవకాశం ఇచ్చారు సంగీత దర్శకుడు శశిప్రీతమ్. అప్పటికి సినీపరిశ్రమలో ఎవరూ పరిచయం లేరు. కేవలం పాట విని శశిప్రీతమ్ నన్ను పిలిచారు అని తెలిపారు.