స్టార్ మా బంపర్ ఆఫర్ ను వదులుకున్న యాంకర్ సుమ.. అసలు కారణం ఇదే..!

సుమ.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేని పేరు. బుల్లితెరపై తనదైన హావభావాలు, టైమింగ్ పంచెస్‌తో ఎంతో మందిని తనవైపునకు తిప్పుకుంది ఈ సీనియర్ యాంకర్. టీవీ షోలు అయినా.. ఫ్యామిలీ యాడ్స్ అయినా.. సినిమా ఈవెంట్లు అయినా.. సుమ ఉంటే ఆ కిక్కే వేరు అనేలా ఆమె తన ముద్రను వేసేసింది. అందుకే సుమ చేతి నిండా ఆఫర్లతో బిబీ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సుమ అభిమానులు షాక్‌కు గురయ్యే ఓ వార్త బయటకు వచ్చింది.

బుల్లితెరపై టాప్ యాంకర్‌గా వెలుగొందుతున్న సుమకు ‘స్టార్ మా’ యాజమాన్యం భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఎన్నో షోలకు వ్యాఖ్యాతగా చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో ప్రారంభం కానున్న తెలుగు రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ సీజన్-3లో కంటెస్టెంట్‌గా పాల్గొనాల్సిందిగా ఆమెకు ‘స్టార్ మా’ యాజమాన్యం నుంచి ఫోన్ వచ్చిందట. ఇందుకు గానూ సుమకు భారీ మొత్తం చెల్లిస్తామని ఆఫర్ కూడా చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘స్టార్ మా’ ఇచ్చిన ఆఫర్‌ను సుమ వద్దనుకుందని సమాచారం. ప్రస్తుతం తాను హోస్ట్ చేస్తున్న ఎన్నో షోలను వదులుకునే సాహసం చేయకూడదని ఆమె నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. షోలు మాత్రమే కాకుండా ఎన్నో సినిమా ఈవెంట్లకు ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. కాబట్టి, బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తే వీటన్నింటిని వదులుకోవాల్సి వస్తుందని కూడా ఆమె ఆలోచిస్తుందనే టాక్ వినిపిస్తోంది.

సుమ ‘స్టార్ మా’ ఆఫర్‌ను వదులుకుందన్న వార్త బయటకు రావడంతో ఆమె అభిమానులు అవాక్కవుతున్నారని తెలుస్తోంది. ఎంచక్కా సుమను వంద రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో చూడొచ్చనుకుంటే ఆమె ఎందుకిలా చేసిందని ఫీలైపోతున్నారట. అంతేకాదు, సుమ కనుక ఈ షోలో పాల్గొంటే.. ప్రస్తుతం ఉన్న ఫాలోయింగ్‌ను బట్టి ఆమె విజేతగా నిలిచేదని కూడా అంటున్నారు.
తెలుగులో అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న ‘బిగ్‌బాస్’ సీజన్ 3 ఈ నెల 21 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లకు జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని హోస్టులుగా వ్యవహరించగా.. ఈ సీజన్‌కు మాత్రం అక్కినేని నాగార్జున రంగంలోకి దిగబోతున్నారు. ఈ మేరకు ‘స్టార్ మా’ యాజమాన్యం ఇప్పటికే ఓ ప్రోమోను విడుదల చేసిన విషయం తెలిసిందే.