ఒక్క పాత్రకే 20 కోట్లా..! RRR లో స్పెషల్ అప్పీరియన్స్

ఇండియన్ సినిమా మార్కెట్ విస్తరించేకొద్దీ హీరోల పారితోషకాలు భారీగా పెరిగిపోతున్నాయి. బాలీవుడ్లో ఒక సినిమాకు రూ.50 కోట్లకు పైగా పారితోషకం తీసుకునే హీరోలు ఇప్పుడు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ఇప్పుడు ఓ బాలీవుడ్ నటుడు ఒక సినిమాలో అతిథి పాత్ర చేస్తున్నందుకు ఏకంగా రూ.20 కోట్లు పారితోషకంగా పుచ్చుకుంటున్నట్లు వార్తలొస్తుండటం విశేషం. ఆ నటుడు అజయ్ దేవగణ్ కాగా.. ఆయన అంత పారితోషకం తీసుకుంటున్నది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్కు అని ప్రచారం జరుగుతుండటం విశేషం.

ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి రాజమౌళే కొన్ని నెలల కిందట అధికారికంగా ప్రకటించాడు. ఆ పాత్ర సినిమా అంతటా ఉండదని.. ఫ్లాష్ బ్యాక్‌లో కీలకంగా ఉంటుందని కూడా వెల్లడించాడు. సినిమాలో గరిష్టంగా 45 నిమిషాలు మాత్రమే ఈ పాత్ర ఉంటుందన్నది చిత్ర వర్గాల సమాచారం. మరి ఆర్ఆర్ఆర్ కోసం అజయ్ ఎన్ని కాల్ షీట్లు ఇచ్చాడో ఏమో కానీ.. పారితోషకంగా మాత్రం రూ.20 కోట్లు తీసుకుంటున్నాడట.

అజయ్‌కి దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగే ఉండటం ఉత్తరాదిన ఈ సినిమాకు క్రేజ్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటం అన్నిటికీ మించి తన పాత్రతో సినిమాకు వెయిట్ తీసుకురాగల సత్తా ఉన్నవాడు కావడంతో ఆ స్థాయిలో పారితోషకం ఇవ్వడానికి నిర్మాత డీవీవీ దానయ్య వెనుకాడలేదట. అజయ్ త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్ రామ్ చరణ్‌కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే.