సీనియర్ నటుడు సూసైడ్ ఎటెంప్ట్.. అసలు విషయం బయటకు

ఈ మధ్యన కాస్త జోరు తగ్గింది కానీ.. గతంలో మాత్రం ప్రతి సినిమాలోనూ ఆయన కనిపించేవారు. మొదట్లో విలన్ వేషాలు.. తర్వాతి కాలంలో సాఫ్ట్ పాత్రలకు షిఫ్ట్ అయిన సీనియర్ నటుడిగా ఆయనకు పేరుంది. ఆయనే చలపతిరావు. సుమారు ముప్ఫై ఏళ్ల క్రితమైతే.. ఆయన విలన్ గా నటించే ప్రతి సినిమాలోనూ రేప్ సీన్ పెట్టేవారు. భయంకరమైన విలనీగా భయపెట్టేవారు. అలాంటి ఆయన బయట తన మాటలతో అప్పుడప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు. ఆ మధ్యన ఒక సినిమా ఆడియో వేడుకలతో మాట్లాడుతూ..

అమ్మాయిలు పడుకోవటానికి తప్ప మరి దేనికి పనికి రారన్న దారుణమైన వ్యాఖ్య చేసి.. తీవ్రమైన విమర్శలకు గురయ్యారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ భారీ రచ్చ నడిచింది. ఇక.. మహిళా సంఘాలైతే ఆయన మీద యుద్దమే ప్రకటించాయి. ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తారా? అంటూ విరుచుకుపడ్డాయి. సినిమా వాళ్ల బలుపు చూపించాడంటూ ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా నటుడు ఆలీ నిర్వహించే షోకు అతిధిగా హాజరైన ఆయన.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాను అన్న మాట తప్పని.. ఆ విషయాన్ని చెప్పి.. కొన్ని వందలసార్లు క్షమాపణలు చెప్పినా కూడా ఎవరూ కనికరించలేదని వాపోయారు. తన విషయంలో మీడియా కూడా ఘోరంగా వ్యవహరించిందన్నారు.

ఆ సమయంలో బాధ భరించలేక.. ఒక క్షణంలో ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని.. సూసైడ్ నోట్ లో తన చావుకు కారణమైన మహిళా సంఘాల పేర్లు రాసి.. వారికి సారీ చెప్పి చనిపోవాలనుకున్నట్లు వెల్లడించారు.