సందీప్ రెడ్డికి బంపర్ ఆఫర్.. అడిగినంత ఇచ్చేలా..!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ తగిలింది. ‘కబీర్ సింగ్’ సినిమాతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అని నిరూపించుకున్న సందీప్‌కు రెండో సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం లభించింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాలు సాధించే దర్శకులు అరుదుగా ఉంటారు. వారిలో సందీప్ రెడ్డి వంగా ఒకరు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తన కెరీర్‌కు బాటలు వేసుకోవడమే కాదు విజయ్ దేవరకొండ జీవితాన్నే మార్చేశారు. ఈ సినిమా ఎంతటి వివాదాన్ని తెచ్చిందో అంతకంటే రెట్టింపు విజయాన్ని అందుకుంది. అందుకే బాలీవుడ్‌లో కూడా సందీపే సినిమాకు దర్శకత్వం వహించాలని పట్టుబట్టి మరీ ఆయన్ను హిందీ సినిమాకు పరిచయం చేశారు.అలా కబీర్ సింగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా అర్జున్ రెడ్డి కంటే రెట్టింపు విజయం సాధించింది. అందుకే ఇప్పుడు సందీప్‌ను బాలీవుడ్‌లో వరుస అవకాశాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఆయనకు బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ తగిలినట్లు తెలుస్తోంది. ఓ నిర్మాణ సంస్థ నిర్మించబోయే సినిమాకు సందీప్ దర్శకత్వం వహించనున్నారు. సినిమా స్క్రిప్ట్ నచ్చి సందీప్ కూడా దర్శకత్వం వహించడానికి ముందుకొచ్చారు.అంతేకాదు.. సినిమా విజయం సాధించినా లేకపోయినా సందీప్‌కు 50 శాతం పారితోషికం చేతికొస్తుందట. ఆయన అడిగినంత ఇవ్వడానికి కూడా సదరు నిర్మాణ సంస్థ ఒప్పుకొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిని బట్టి చూస్తే ఇప్పట్లో ఆయనకు టాలీవుడ్ సినిమాలు చేసే సమయం దొరికేలా లేదు. సందీప్.. సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తన వద్ద ఉన్న కథ గురించి సందీప్.. మహేశ్‌కు వినిపించారని ఆయనకు స్క్రిప్ట్ నచ్చడంతో ఓకే చేశారని గతంలో వదంతులు వినిపించాయి.

అన్నీ అనుకున్నట్లు కుదిరితే సినిమాను 2020లో సెట్స్ మీదకు తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయని అన్నారు.ఏదేమైనా తన సత్తాతో ఇటు తెలుగు ప్రేక్షకులతో పాటు అటు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా తన కాన్సెప్ట్‌తో ఫిదా చేశారు సందీప్. తొలుత అర్జున్ రెడ్డి పోస్టర్ విడుదలైనప్పుడు సినిమా వివాదాస్పదమైంది. ఓ మంత్రి అయితే ఏకంగా బస్సుపై అంటించి ఉన్న పోస్టర్‌ను చింపేశారు కూడా. కానీ సినిమా విడుదలయ్యాక అందరూ విజయ్‌ని సందీప్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు.