సాహో ఎఫెక్ట్.. ప్రభాస్ కు మరో గట్టి దెబ్బ

జయంత్ సి పరాన్జీ తెరకెక్కించిన ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఆ తరువాత మెల్లగా ఒక్కొక్కటిగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటూ ముందుకు సాగారు. కెరీర్ పరంగా వర్షం సినిమాతో తొలి సక్సెస్ అందుకున్న ప్రభాస్, ఆ తరువాత ఛత్రపతి, బుజ్జిగాడు, బిర్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి సినిమాలతో సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లు అందుకుని దేశ విదేశాల్లో కూడా మంచి పేరు సంపాదించారు ప్రభాస్.

అయితే ఆ సినిమాల తరువాత ఇండియా వ్యాప్తంగా కూడా ప్రభాస్ కు మార్కెట్ విపరీతంగా పెరగడంతో,వాటి అనంతరం తెరకెక్కిన సాహో సినిమాకు ఏకంగా రూ.350 ఖర్చు పెట్టి ఆ సినిమాను నిర్మించారు నిర్మాతలు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించిన సాహో సినిమా, ఇటీవల రిలీజ్ అయి, ప్రేక్షకుల నుండి చాలావరకు నెగటివ్ స్పందనను రాబట్టింది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు చాలా చోట్ల సరిగ్గా కలెక్షన్లు లేక నష్టాలు వస్తుండడంతో యూనిట్ మొత్తం కొంత ఆలోచనలో పడింది. నిజానికి ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమాపై దర్శకుడు సుజీత్ సహా ఆ సినిమా యూనిట్ మొత్తం నీళ్లు చెల్లిందని, కేవలం గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ తప్ప, చెప్పుకోదగ్గ కథ, కథనాలు సాహోలో లేవని మెజారిటీ ప్రేక్షకులు సినిమాపై పెదవి విరుస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఫెయిల్ అయిన ప్రభావం, ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ప్రభాస్ లేటెస్ట్ సినిమా ‘జాన్’ మీద పడనుందని నేడు ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.ఇక ఆ వార్తల ప్రకారం, ఇప్పటికే సాహోతో ఎంతో దెబ్బ తిన్న బయ్యర్లు, రాబోయే జాన్ సినిమాను కొనడానికి అంత ఆసక్తిగా ముందుకు రాకపోవచ్చని అంటున్నారు.

అదీకాక అందుకు రెండు కారణాలు కూడా చెప్తున్నారు. అవేమిటంటే, ఒకటి ఈ జాన్ సినిమా కూడా భారీ ఖర్చుతో నిర్మితం అవుతుండడం ఒక కారణం అయితే, సుజీత్ వలే జాన్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ కు కూడా పెద్ద అనుభవం లేకపోవడం, అందునా అతడి తొలిసినిమా జిల్, ఘోరంగా ఫెయిల్ అవడం మరొక కారణం అని అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్నట్లుగా నిజంగా సాహో ఫెయిల్యూర్ వలన జాన్ సినిమాకు పూర్తిగా కాకపోయినా కొంత వరకు మాత్రం బిజినెస్ పరంగా దెబ్బ పడే అవకాశం లేకపోలేదని, అయితే సాహో కనుక మంచి విజయం అందుకుని ఉంటె, ఈ పాటికి జాన్ కు ఊహించని రేంజ్ లో బిజినెస్ ఆఫర్లు వచ్చి ఉండేవని అంటున్నారు సినీ విశ్లేషకులు…..!!