యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రమిది. ఇటు చెర్రీ అభిమానులు, అటు తారక్ అభిమానులు ఇద్దరూ ఈ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే కీలక సన్నివేశాల కోసం విదేశాలకు వెళ్లిన చిత్ర బృందం తిరిగొచ్చింది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ఈ విషయాన్ని రామ్‌చరణ్ స్వయంగా వెల్లడించారు.
రామ్‌చరణ్ కారులో వెళ్తూ.. ‘రామోజీ ఫిల్మ్‌సిటీలో ఉదయం షూటింగ్ లకు రావడం ఎంతో బాగుంటుంది. మార్నింగ్ షూట్ ను నేను ఎంతో ఆస్వాదిస్తాను. లవ్ యూ’ అంటూ వీడియోను పంచుకున్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీంగా కనిపించనున్నారు. షూటింగ్ ప్రారంభమై కొన్ని నెలలు కావొస్తున్నా, ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేయలేదు.అయితే ఈ ఏడాది ముగింపు సందర్భంగా డిసెంబర్ 31న లేదా నూతన ఏడాదికి స్వాగతం పలుకుతూ చిత్ర యూనిట్ రామ్ చరణ్, లేదా ఎన్టీయార్ కు సంబంధించిన ఏదో ఒక వార్తను విడుదల చేస్తోందని చిత్రపురి వర్గాల ద్వారా సమాచారం.
ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ కు జోడీగా ఆలియాభట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ కు కథానాయికను అన్వేషించే పనిలో ఉంది చిత్ర బృందం. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ 2020 జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.