మళ్ళీ షాకిచ్చిన రాణా.. దిక్కుతోచని నిర్మాతలు

రానా దగ్గుబాటి ఆరోగ్య పరమైన సమస్యలతో బాధ పడుతూ విదేశాలలో చికిత్స తీసుకుంటున్నాడనే వార్తలు మీడియాలో వస్తూనే వున్నా కానీ తాను ఏదో సినిమా సంబంధిత వ్యవహారంపై అక్కడికి వెళ్లినట్టుగా అతను చెబుతూ వచ్చాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో రానా బాధపడుతున్నాడని, అందుకే అతని శరీరం అంతగా క్షీణించిందని మీడియాలో వార్తలు మాత్రం ఆగలేదు. ఇటీవల అతను అమెరికా నుంచి ఇప్పట్లో రాడని వార్తలు రాగా, ఇండియా వచ్చేస్తున్నట్టు రానా ప్రకటించాడు.

దాంతో అతనితో సినిమాలు ఓకే చేసుకుని అతను షూటింగ్‌లో జాయిన్‌ అవడం కోసం ఎదురు చూస్తోన్న నిర్మాతలు ఊపిరి తీసుకున్నారు. అయితే రానా కేవలం మీడియాని డైవర్ట్‌ చేయడానికే ఆ ప్రకటన చేసాడని తర్వాత బోధ పడింది. అమెరికా నుంచి ఇండియాకి షిఫ్ట్‌ అయితే అయ్యాడు కానీ రానా ప్రస్తుతం ముంబయిలోనే నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వున్నాడు. దసరా శుభాకాంక్షలు తెలియజేయడానికి కూడా తన ప్రస్తుత లుక్‌ రివీల్‌ చేయకుండా బాహుబలిలో ఫోటో పెట్టాడు.

రాణా ఇంకా కోలుకోలేదని, మరికొన్ని నెలల పాటు ముంబయిలోనే వుండాలని, అతనిప్పుడు రోజంతా షూటింగ్‌ చేసేటంత శ్రమ తీసుకోలేడని డాక్టర్లు తేల్చేయడంతో అతని సినిమా షూటింగ్స్‌ మళ్లీ వాయిదా పడ్డాయి. రానా, సాయి పల్లవి నటిస్తోన్న ‘విరాఠపర్వం’ చిత్రానికి యాభై శాతం షూటింగ్‌ పూర్తయింది. రానా వస్తే కానీ మిగతా భాగం పూర్తి చేయలేరు. తన సోలో పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసిన సాయి పల్లవి ఆల్రెడీ శేఖర్‌ కమ్ముల చిత్రం సెట్లోకి అడుగు పెట్టింది.