రాం చరణ్ షాకింగ్ డెసిషన్.. తండ్రి కోసం తప్పడం లేదుగా..!

‘సైరా: నరసింహారెడ్డి’.. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇది ఆయనకు 151వ చిత్రం. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కొణెదల ప్రొడక్షన్స్‌పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు.ఇందులో చిరు సరసన నయనతార నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, తమన్నా కీలక పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు విశేష స్పందన వచ్చింది.గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తుందట. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఈ నెల 14 నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేస్తుందని తెలిసింది.ఇందులో భాగంగా పలు రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నారని టాక్. చిత్ర నిర్మాత రామ్ చరణ్ ఇందుకోసం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఆ నెల 20న ముంబైలో విడుదల చేయబోతున్నారట. అక్కడ భారీ స్థాయిలో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ సహా పలువురు ముఖ్య నటులు హాజరు కానున్నారని ఫిలింనగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.

వాస్తవానికి ఖతార్‌లోని దోహాలో ఈ సినిమా ట్రైలర్ విడుదల చేస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఆగస్టు 15, 16 తేదీల్లో అక్కడ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఫంక్షన్ జరగనుంది. అదే వేదికపై ‘సైరా: నరసింహారెడ్డి’ ట్రైలర్‌ విడుదల చేస్తారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.