‘రాజ్‌దూత్‌’ మూవీ రివ్యూ & రేటింగ్

సినిమా: ‘రాజ్‌దూత్’

బ్యానర్: లక్ష్య ప్రొడక్షన్స్‌

తారాగణం: మేఘాంశ్‌ శ్రీహరి, నక్షత్ర, ప్రియాంకవర్మ, అనీష్‌ కురువిళ్ళ, ఆదిత్య మీనన్‌, సుదర్శన్‌, కోట శ్రీనివాసరావు, దేవిప్రసాద్‌, ఏడిద శ్రీరామ్‌, మనోబాల తదితరులు

సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్‌ చింతా

ఎడిటింగ్‌: విజయవర్థన్‌

సంగీతం: వరుణ్‌ సునీల్‌

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: జె.బి.

నిర్మాత: ఎం.ఎల్‌.వి.సత్యనారాయణ(సత్తిబాబు)

రచన, దర్శకత్వం: అర్జున్‌-కార్తీక్‌

విడుదల తేదీ: 12.07.2019

నటుడిగా, వ్యక్తిగా ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకొని అకాల మరణం పొందిన రియల్‌ స్టార్‌ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ శ్రీహరి ‘రాజ్‌దూత్‌’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. అర్జున్‌, కార్తీక్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఎం.ఎల్‌.వి.సత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన నటనతో, రియల్‌ యాక్షన్‌తో రియల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ తన మొదటి సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో ఎలాంటి ముద్ర వేయగలిగాడు? ‘రాజ్‌దూత్‌’ అనే విభిన్నమైన టైటిల్‌తో రూపొందిన ఈ సినిమాలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న అంశాలేమిటి? మేఘాంశ్‌కి హీరోగా ‘రాజ్‌దూత్‌’ పర్‌ఫెక్ట్‌ లాంచ్‌ అనిపించుకుందా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

క‌థ‌:

ప్రస్తుతం వస్తున్న యూత్‌ సినిమాల్లో హీరోలాగే ఈ సినిమాలో హీరో సంజయ్‌(మేఘాంశ్‌) కూడా జాలీగా లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తూ ఉండే కుర్రాడు. అతని నాన్న స్నేహితుడి కూతురు ప్రియ(నక్షత్ర)ను సంజయ్‌. తమ ఇద్దరికీ పెళ్లి చేయమని పదే పదే ప్రియ తండ్రిని విసిగిస్తుంటాడు. సంజయ్‌ యాటిట్యూడ్‌ నచ్చని ప్రియ తండ్రి దానికి ఒప్పుకోడు. ఈ విషయంలో ఎంతో పట్టుదలతో ఉన్న సంజయ్‌ మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంటాడు. చివరికి ప్రియ తండ్రి ఓ నిర్ణయానికి వస్తాడు. తన తండ్రి 20 ఏళ్ళ క్రితం కోమాలోకి వెళ్లాడని, ఈమధ్యే స్పృహలోకి వచ్చాడని చెప్తాడు ప్రియ తండ్రి. కోమా నుంచి బయటికి వచ్చిన వారిలో ఎక్కువ మంది ఇప్పటి వాతావరణం నచ్చక మళ్ళీ కోమాలోకి వెళ్ళడమో, చనిపోవడమో జరుగుతుందని డాక్టర్‌ చెప్పాడని, అలా జరగకుండా ఉండాలంటే తన తండ్రి ప్రాణంగా చూసుకునే రాజ్‌దూత్‌ బైక్‌ని తెచ్చివ్వాలని, అప్పుడే ప్రియతో పెళ్ళి జరిపిస్తానని అంటాడు. అయితే 20 ఏళ్ళ క్రితమే ఆ బైక్‌ చేతులు మారి ఎక్కడికో చేరింది. దాన్ని తీసుకురావడానికి స్నేహితుడితో కలిసి బయల్దేరతాడు సంజయ్‌. ఈ జర్నీలో బైక్‌ కోసం సంజయ్‌ ఎక్కడెక్కడికి తిరిగాడు? ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరికి ఆ బైక్‌ ఏ విధంగా ఓనర్‌ దగ్గరికి వచ్చింది? అనేది మిగతా కథ.

విశ్లేష‌ణ‌:

రియల్‌స్టార్‌ శ్రీహరిలాంటి హీరో కొడుకు సినిమా అంటే ఎలా ఉంటుంది? మేఘాంశ్‌ హీరోగా ఎలాంటి మెరుపులు మెరిపించాడు అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే అలాంటి మెరుపులు ఏమీ లేకుండా చాలా సాదా సీదాగా మేఘాంశ్‌ని స్క్రీన్‌పై ఇంట్రడ్యూస్‌ చేశారు. అందరి హీరోల కొడుకుల మాదిరిగా హడావిడి చేయకపోవడం బాగానే ఉన్నా, మరీ అంత పూర్‌ ఇంట్రడక్షన్‌ కూడా ప్రేక్షకులకు నచ్చదు. అయితే మేఘాంశ్‌లో హీరోకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. అయితే డాన్స్‌ పరంగా, ఫైట్స్‌పరంగా అతన్ని బాగా ఎస్టాబ్లిష్‌ చెయ్యాలన్న ప్రయత్నం దర్శకులు చెయ్యలేదు. ఒకటి, రెండు చోట్ల డాన్స్‌, ఫైట్స్‌ చేయించినా ఆ మోతాదు సరిపోలేదు. కానీ, క్యారెక్టర్‌కి ఉన్న లిమిట్స్‌ మేరకు తన పెర్‌ఫార్మెన్స్‌తో మెప్పించాడు మేఘాంశ్‌. హీరోయిన్‌ నక్షత్ర కేవలం హీరోయిన్‌ క్యారెక్టర్‌ కోసమే అన్నట్టుగా ఉంది తప్ప ఆమెకు పెర్‌ఫార్మ్‌ చేసే అవకాశం ఎక్కడా లభించలేదు. హీరో ఫ్రెండ్‌గా నటించిన సుదర్శన్‌ తన డైలాగులతో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ, అది నామ మాత్రమే. ఇక సినిమాలో మిగిలిన క్యారెక్టర్ల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆదిత్యమీనన్‌, అనీష్‌ కురువిళ్ళ, దేవిప్రసాద్‌, కోట శ్రీనివాసరావు తదితర నటులు ఓకే అనిపించారు. మనోబాల చేసిన క్యారెక్టర్‌ మాత్రం కొంత వరకు నవ్వులు పూయించింది.

సాంకేతిక నిపుణుల గురించి చెప్పుకోవాల్సి వస్తే విద్యాసాగర్‌ ఫోటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్‌ ఎంతో అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. విజయవర్థన్‌ ఎడిటింగ్‌ ఫస్ట్‌ హాఫ్‌ ఓకే అనిపించింది కానీ, సెకండాఫ్‌లో చాలా సీన్స్‌ ల్యాగ్‌ అనిపించాయి. దాంతో లెంగ్త్‌ ఎక్కువైందన్న ఫీలింగ్‌ కలుగుతుంది. వరుణ్‌ సునీల్‌ చేసిన పాటల్లో ‘ప్రాణం నువ్వే కదా’ పాట లిరికల్‌గా, మ్యూజికల్‌గా బాగుంది. జె.బి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగా చేశాడు. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. ఇక డైరెక్టర్స్‌ అర్జున్‌, కార్తీక్‌ల గురించి చెప్పాలంటే ఇది చాలా సాదా సీదా కథ. ఏమాత్రం ఆసక్తి రేకెత్తించని కాన్సెప్ట్‌. తన కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేయాలంటే పాతకాలం నాటి రాజ్‌దూత్‌ బైక్‌ని తీసుకురావాలని చెప్పడంతోనే కథ ఏమిటో అందరికీ అర్థమైపోతుంది. హీరోకి ఈ విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనేది ఆడియన్స్‌ ఊహాతీతంగా ఏమీ లేదు. బైక్‌ తేవడమనే చిన్న కాన్సెప్ట్‌ని ఎన్ని గంటలైనా పొడిగించే అవకాశం ఉంది. దాన్ని ఆసరాగా చేసుకొని రకరకాల ట్విస్టులు పెట్టే ప్రయత్నం చేశారు. కానీ, ఏ ఒక్కటీ సహజంగా అనిపించదు. ఎక్కడా ఆడియన్స్‌ థ్రిల్‌ అయిన సందర్భాలు ఉండవు. బైక్‌ కోసం ఊళ్ళు పట్టుకొని హీరో తిరగడం చూసే ఆడియన్స్‌కి ఒక దశలో సహనం చచ్చిపోతుంది. త్వరగా బైక్‌ తెచ్చేస్తే థియేటర్‌ నుంచి బయటికి వెళ్లిపోతాం అనే అసహనం ప్రేక్షకుల మొహాల్లో కనిపిస్తుంది. ఊళ్ళల్లోని వ్యక్తుల ప్రవర్తన, అక్కడి వాతావరణం కూడా విచిత్రంగా అనిపిస్తుంది. రాజ్‌దూత్‌ అనే బైక్‌ కోసమే సినిమా అని మొదటే తేల్చేసినా తర్వాత వచ్చే సీన్స్‌లో ఆడియన్స్‌లో క్యూరియాసిటీని క్రియేట్‌ చేసే అంశాలు ఏమైనా జొప్పించి ఉంటే కాస్త బాగుండేది. అలా కాకుండా ఫ్లాట్‌గా సినిమా వెళ్లిపోవడంతో సినిమాలో ఎక్కడా హైప్‌ అనేది కనిపించదు. శ్రీహరిలాంటి హీరో కొడుకు మొదటి సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉంటుందోనని ఆశపడ్డ ఆడియన్స్‌కి ‘రాజ్‌దూత్‌’ నిరాశ మిగులుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

బాటమ్‌ లైన్‌: మిస్‌ఫైర్‌ అయ్యింది

రేటింగ్‌: 1.75/5