రాజమౌళీ పై మండీపడుతున్న నెటిజన్స్

దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో ఆర్ ఆర్ ఆర్ అనే వర్కింగ్ టైటిల్‌తో పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించి ఇప్పటి వరకు ఒకే ఒక్క పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ ఒక్క పోస్టర్‌తో సూపర్ క్రేజ్ వచ్చింది సినిమాకు. రాజమౌళి తన సినిమాలకు సంబంధించిన ఎటువంటి విషయాలు బయటకు రాకుండా వాటిపై విపరీతమైన క్రేజ్ వచ్చేలా చేయడం ఆయనకు తెలిసిన గొప్ప మార్కెటింగ్ టెక్నిక్ అని చెప్పవచ్చు.

 

అంతేకాకుండా తన సినిమాలకు ప్రేక్షకులలో ఉండే క్రేజ్ రీత్యా ఆయన ఇచ్చే చిన్న అప్డేట్ కూడా అత్యంత ఆదరణ పొందుతుంది. దీనికి తోడు బాహుబలి లాంటి భారీ హిట్ తరువాత ఆయన తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ఆర్ ఆర్ ఆర్ విషయంలో కూడా ఫ్యాన్స్ ఆరాటం మాములుగా లేదు. ఆ సినిమా అప్డేట్స్ కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆర్ ఆర్ ఆర్ హీరోలు, వారి పాత్రలు కథా నేపథ్యం గురించి సినిమా ప్రారంభంలోనే చెప్పిన రాజమౌళి ఆ తరువాత ఆ చిత్రంపై ఒక్క అప్డేట్ ఇవ్వలేదు.రాజమౌళి న్యూ ఇయర్ సంధర్భంగా ఆర్ ఆర్ ఆర్ నుండి కొత్త పోస్టరో లేదా ఏమైనా ఆప్డేట్ వస్తుందో అని అందరూ భావించారు.

 

దీనికి తోడు నిన్నటి నుండి ఆర్ ఆర్ ఆర్ టీమ్ కూడా పోస్టర్ ప్రిపేర్ చేస్తున్నామంటూ ట్విట్టర్ అప్డేట్స్ ఇస్తుంటే అభిమానులు ఈ మూవీ నుండి కొత్త అప్డేట్.. ఏదైనా వస్తుందేమో అని అనుకున్నారు. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు అనూహ్యంగా ఎప్పటిదో ఎన్టీఆర్ చరణ్ ఉన్న ఆర్ ఆర్ ఆర్ మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్ పై సింపుల్‌గా హ్యాపీ న్యూ ఇయర్ 2020 అంటూ విడుదల చేసింది చిత్రబృందం. దీంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్, చరణ్ అభిమానులు ఆ పోస్టర్ చూసి ఇది చాలా దారుణం అంటూ చర్చించుకుంటున్నారు.