సరికొత్త అనుమానాలు.. రాజ్ తరుణ్ యాక్సిడేంట్ కేసులో కీలక మలుపు

మూడు రోజుల క్రితం హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ వద్ద ఓ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే హీరో తరుణ్ కారు అని వార్తలు వచ్చాయి. వీటిని అతడు ఖండించడంతో, తర్వాత మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు తెరపైకి వచ్చింది. అదే సమయంలో సీసీ టీవీ పుటేజ్‌ కూడా బయటకు వచ్చింది. అందులో కారు దిగి పారిపోతున్న వ్యక్తి రాజ్ తరణ్‌లా ఉండడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. ఇక, బుధవారం ఈ ప్రమాదంపై హీరో రాజ్ తరుణ్ స్పందించిన విషయం తెలిసిందే.యాక్సిడెంట్ తర్వాత పారిపోవడంపై ప్రత్యేకంగా వివరణ ఇచ్చాడు. ‘నేను క్షేమంగానే ఉన్నాను. నాకోసం ప్రార్ధించిన వారందరికీ ధన్యవాదాలు. ప్రమాదం జరిగిన తర్వాత కారు నుంచి కిందికి దిగాను. కారును చూశాను. నాకేమైనా గాయాలయ్యాయేమోనని చూసుకున్నాను. ఆ వెంటనే ఎవరి సహాయమైనా తీసుకుందామన్న ఉద్దేశ్యంతో అక్కడి నుంచి వేగంగా పారిపోయాను. ఆ యాక్సిడెంట్ సమయంలో జరిగింది అంతా ఇదే’ అని అతడు చెప్పుకొచ్చాడు.కి రాజ్ తరుణ్ ట్విట్టర్‌లో అభిమానులతో చిట్ చాట్ చేశాడు.

ఈ సందర్భంగా ‘ప్రమాదం జరిగినప్పుడు మద్యం సేవించి ఉన్నారా’ అని చాలా మంది అతడిని ప్రశ్నించారు. అందులో ఒకరికి నో అని సమాధానం ఇచ్చాడు. మధ్యలో మరో నెటిజన్ ‘డ్రింక్ చేస్తే మాత్రం చేసాం అని చెప్తారా ఏంటి’ అని వ్యంగ్యంగా అన్నాడు. దీనికి ‘యాక్సిడెంట్ అయ్యి బాధ పడితే.. గోరు చుట్టు మీద రోకలి పోటు ఏంటి భయ్యా’ అంటూ రాజ్ తరుణ్ రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ ట్వీట్ చర్చనీయాంశం అవుతోంది.రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన సమయంలో కార్తీక్ అనే ఓ వ్యక్తి ఆ దృశ్యాలను తన సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. అంతేకాదు రాజ్ తరుణ్ కారు దిగి పారిపోతుండగా అతన్ని వెంటాడి పట్టుకున్నాడు కార్తీక్. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య చర్చలు కూడా సాగాయి. ఆ తర్వాత రాజ్‌ తరుణ్‌ను స్వయంగా ఇంటి దగ్గర దించానని చెప్పాడు. అంతేకాదు, అప్పుడు తనకు రాజ్ తరుణ్ పర్సనల్ నంబర్ కూడా ఇచ్చాడని వెల్లడించాడు.తర్వాతి రోజు రాజ్ తరుణ్ తనకు ఫోన్ చేసి వీడియోలు డిలీట్ చేయమని బ్రతిమాలాడని కార్తీక్ తెలిపాడు. అంతేకాదు, ఈ విషయమై తన మేనేజర్ నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతాడని చెప్పాడన్నాడు. తర్వాత ఆయన ఫోన్ చేసి ‘మీకు ఎంత కావాలి..? అవసరమైతే ఐదు లక్షలు ఇస్తాం ఆ వీడియోలు డిలీట్ చేయండి’ అని చెప్పాడని ఓ కాల్ రికార్డును బయటపెట్టాడు. అయితే, అందులో రాజా రవీంద్ర బేరాలు ఏమీ మాట్లాడలేదు. నా అసిస్టెంట్ వస్తాడు అని మాత్రం చెప్పడం వినిపించింది.ఆ తర్వాత ఏం జరిగిందో ఆధారాలు చూపని కార్తీక్.. ఓ మహిళ ఫోన్ చేసి బెదిరించిందని మాత్రం ఓ ఆడియోను బయట పెట్టాడు. అందులో మాట్లాడిన మహిళ కార్తీక్‌ను నిజంగానే తిట్టింది. అదే సమయంలో ‘ఇలా బెదిరింపులకు పాల్పడడం ఎంత వరకు కరెక్ట్’ అని నిలదీసింది. అంతేకాదు, ‘ఆ స్థానంలో మీ తల్లిదండ్రులు ఉంటే.. ఎవరైనా ఇలాగే బెదిరిస్తే ఏం చేస్తావ్.? డబ్బులు కావాలని బెదిరిస్తున్నావ్ సిగ్గులేదా..?’ అంటూ తిట్టింది. దీంతో కార్తీకే డబ్బులు కావాలని బెదిరించాడన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ కేసు గురువారం సాయంత్రం కొత్త మలుపు తిరిగింది. యాక్సిడెంట్‌ వీడియోలు మీడియాకు ఇస్తానని డిజైనర్‌ కార్తీక్‌ బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డాడని రాజ్‌ తరుణ్‌ మేనేజర్‌ రాజా రవీంద్ర గురు వారం మాదాపూర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 21న కార్తీక్‌ అనే వ్యక్తి తనకు కాల్‌ చేసి రాజ్‌ తరుణ్‌కు సంబంధించిన ఒక వీడియో తన వద్ద ఉందని చెప్పాడని పేర్కొన్నారు. రూ.5 లక్షలు ఇవ్వకుంటే సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడని తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.