పవన్ రీ ఎంట్రీ నిజమేనా..? టాలీవుడ్ లో రచ్చ రచ్చ

పాలిటిక్స్‌తో బిజీ అయిన తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా రంగానికి దూరమవ్వడం అభిమానులను కుంగదీస్తున్నది. అయితే ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్ల నటిస్తారనే ఊహాగానాలు ఊపందుకొన్నాయి. అయితే వాటిపై క్లారిటీ కనిపిచండం లేదు. అలాంటి రూమర్లలో తాజాగా ఒక వార్త మీడియాలో వైరల్ అయింది. బాలీవుడ్‌ భారీ సక్సెస్‌ను అందుకొని, తమిళంలో రీమేక్ అయి సంచలన విజయం సాధించిన ఓ చిత్రంలో నటింపజేయాలనే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయనేది వార్తాకథనంలో ప్రధాన అంశం. వివరాల్లోకి వెళితే..
పాలిటిక్స్‌లోకి ఎంటర్ కాకముందు పవన్ కల్యాణ్, ఏఎం రత్నం కాంబినేషన్‌లో సినిమా రావాల్సింది. పవన్ కల్యాణ్‌కు నిర్మాత ఇప్పటికే కొంత మొత్తం అడ్వాన్సుగా చెల్లించారనే విషయం మీడియాలో నానుతున్నది. కానీ ఆ ప్రాజెక్ట్ రాజకీయాలు, ఎన్నికల్లో తలమునకలైన కారణంగా సెట్స్‌లోకి వెళ్లలేకపోయింది. తాజాగా అదే ప్రాజెక్ట్ స్థానంలో తాజా మరో సినిమాలో నటించేలా పవన్‌ను ఏఎం రత్నం మెప్పించే ప్లాన్ చేస్తున్నారు.


తాజా రిపోర్టు ప్రకారం ఇటీవల పవన్ కల్యాణ్‌ను ఏఎం రత్నం కలిసి తమ ప్రాజెక్ట్ గురించి సంప్రదించారట. బాలీవుడ్ చిత్రం పింక్ రీమేక్‌లో నటించాలని కోరినట్టు సమాచారం. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమాలో నటించమని రత్నం ప్రపోజల్ పెట్టినట్టు సమాచారం. అయితే తన రీఎంట్రీపై ఎలాంటి హామీని పవన్ కల్యాణ్ ఇవ్వలేదని స్పష్టంగా తెలుస్తున్నది.
పింక్ చిత్రం బాలీవుడ్‌లో ఘన విజయం సాధించింది. అమితాబ్ బచ్చన్, తాప్సీ నటనకు మంచి పేరు వచ్చింది. ఇక ఇటీవల అదే చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ తమిళంలో అజిత్, శ్రద్ధా శ్రీనాథ్‌తో రీమేక్ చేయగా కోలీవుడ్‌లో సంచలన విజయం సాధించింది. ఆ చిత్రాన్ని ఇక తెలుగులో కూడా నిర్మించాలన్న ఏఎం రత్నం తాజా ప్రయత్నం.
ఒకవేళ పింక్ సినిమాతో పవన్ కల్యాణ్ సినిమాల్లోకి మళ్లీ వస్తే ఫ్యాన్స్‌కు పండుగే. పవన్ కల్యాణ్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడా అనే విషయంపై అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఏఎం రత్నం సినిమా పవన్ చేస్తారా? అనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత కూడా మైత్రీ మూవీస్ సినిమా చేస్తారనే విషయం కూడా చర్చ జరుగుతున్నది. ఇటీవల మైత్రీ నిర్మాతలు కూడా పవన్ మాకు సినిమా చేస్తాడని వెల్లడించిన సంగతి తెలిసిందే.