పాతరోజులను గుర్తు చేసుకున్న చిరంజీవి, భావోద్వేగంలో విజయశాంతి..

లేడీ అమితాబ్ విజ‌య‌శాంతిపై మెగాస్టార్ చిరంజీవి చిరుబుర్రులాడారు. దీనికి హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో వైభ‌వంగా నిర్వ‌హించిన‌ ‘సరిలేరు నీకెవ్వరు’ ఫ్రీరిలీజ్ ఫంక్ష‌న్ వేదికైంది. హీరో మ‌హేశ్‌బాబు, రష్మిక మందన హీరోయిన్‌గా న‌టించారు.అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ ఈ చిత్రం 11న రిలీజ్ కానుంది. ఫ్రీరిలీజ్ ఫంక్ష‌న్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజ‌ర‌య్యారు. అలాగే చిరంజీవి స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించిన విజ‌య‌శాంతి ద‌శాబ్ద కాలం త‌ర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘సరిలేరు నీకెవ్వరు’ న‌టీన‌టుల‌తో పాటు నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు…అంద‌రి గురించి చెబుతూ ప్ర‌శంసించారు. ఆ త‌ర్వాత విజ‌య‌శాంతి ద‌గ్గ‌రికొచ్చారు.

 

విజ‌య‌శాంతితో త‌న‌కు చాలా ఎమోష‌న్స్ రిలేష‌న్స్‌ అని చెప్పారు. కుటుంబ స‌భ్యుల్లా క‌లిసి ఉండేవార‌మ‌న్నారు. చెన్నై టీన‌గ‌ర్‌లో త‌న‌ది, ఆమె ఇల్లు ఎదురెదురుగా ఉండేవ‌న్నారు. వారింట్లో లేదా త‌న ఇంట్లో ఏం ఫంక్ష‌న్ జ‌రిగినా అంద‌రం క‌లుసుకునే వాళ్ల‌మ‌న్నారు. ఇద్ద‌రం క‌ల‌సి 19-20 సినిమాలు చేసిన‌ట్టు చెప్పుకొచ్చారు.అయితే ‘విజ‌య‌శాంతి నీ మీద నాకు చిన్న కోపం ఉంది’ అని ప‌క్క‌నే ఉన్న ఆమెతో చిరంజీవి కాస్త ముఖం చిన్న‌బుచ్చుకుంటూ అన్నారు.‘ఎందుకు’ అని విజ‌య‌శాంతి ప్ర‌శ్నించారు.‘నాకంటే ముందు పాలిటిక్స్‌లోకి వెళ్లావు క‌దా’ అని చిరంజీవి ప్ర‌శ్నించారు.‘అవును, 22 ఏళ్లు అవుతోంది’ అని విజ‌య‌శాంతి స‌మాధాన‌మిచ్చారు.‘మేము కొంచెం ర‌హ‌స్యంగా మాట్లాడుకుంటున్నాం’ అని చిరంజీవి మ‌రింత ఉత్కంఠ రేకెత్తించారు.‘స‌రే ఏదైతేనేం నాకంటే ముందే వెళ్లావు క‌దా. న‌న్ను ఆ మాట‌లు అనాల‌ని ఎలా మ‌న‌సు వ‌చ్చిందో చెప్పు’ అంటూ విజ‌య‌శాంతిపై ‘చిరు’బుర్రులాడారు.దీంతో విజ‌య‌శాంతి కంగుతిన్నారు. స‌మాధానం చెప్ప‌డానికి చిరు నుంచి మైక్ తీసుకునేందుకు య‌త్నించారామె. మొద‌ట ఇవ్వ‌న‌న్నట్టు నిరాక‌రించినా, ఆ త‌ర్వాత విజ‌య‌శాంతికి చిరంజీవి మైక్ ఇచ్చారు.

 

‘పంచ్ డైలాగ్‌లు వేశారీయ‌న‌. చేయి చూశావా, ఎంత ర‌ఫ్‌గా ఉందో? ర‌ఫ్ ఆడించేస్తా జాగ్ర‌త్త ’ అంటూ విజ‌య‌శాంతి అంతే ఆట ప‌ట్టించారు.‘రాజ‌కీయం వేరు, సినిమా వేరు. అయినా మ‌నిద్ద‌రం మిత్రులం. నా హీరో మీరు, మీ హీరోయిన్ నేను. ఇద్ద‌రం క‌లిసి 20 సినిమాలు తీశాం. ఎక్కువ సినిమాలు మీతోనే చేశాను. అది కాద‌న‌లేరు క‌దా? మ‌రిచిపోయారా? అందులో ఏమైనా డౌట్ ఉందా?’ అని విజ‌య‌శాంతి రెట్టిస్తూ అడిగారు.‘అందులో అస‌లు డౌట్ లేదు’ అని చిరంజీవి అన్నారు.‘మ‌ళ్లీ యాక్ట్ చేద్దామా’ అని విజ‌య‌శాంతి ఉత్సాహంతో అడిగారు.‘వైనాట్, వైనాట్ ’ అంటూ చిరంజీవి చిన్న‌పిల్లాడిలా ఉత్సాహంతో పొంగిపోయారు.20 ఏళ్ల త‌ర్వాత చిరంజీవిని చూస్తున్న‌ట్టు విజ‌య‌శాంతి తెలిపారు.ఆ త‌ర్వాత చిరంజీవి పాట పాడుతూ పాత రోజులును గుర్తు చేశారు. విజ‌య‌శాంతిపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు.‘రాజ‌కీయం శ‌త్రువుల‌ను పెంచుతుంది. మా సినీమాత స్నేహాన్ని పెంచుతుంది’ అంటూ విజ‌య‌శాంతిని ద‌గ్గరికి తీసుకుంటూ చిరంజీవి సందేశాన్ని ఇచ్చారు.త‌న‌ను విజ‌య‌శాంతి కామెంట్స్ చేసినా…తానెప్పుడు ఆమెను విమ‌ర్శించ‌లేద‌న్నారు. ‘ఎక్క‌డైనా నిన్ను ఒక్క మాటైనా అన్నానా? నాకు విమ‌ర్శించ‌డానికి మ‌న‌సు రాలేదు. అందుకే అన‌లేక‌పోయాను. మా విజ‌య‌శాంతి’ అని చిరంజీవి భావోద్వేగంతో అన్నారు.

 

విజ‌య‌శాంతితో త‌న‌కు రాజ‌కీయాలు గ్యాప్ పెంచాయ‌ని, 20 ఏళ్ల త‌ర్వాత తాము క‌లిసే అవ‌కాశం క‌ల్పించిన మ‌హేశ్‌బాబుకు ధ‌న్య‌వాదాలని చిరంజీవి తెలిపారు. మొత్తానికి 2009లో చిరంజీవి ప్ర‌జారాజ్యం స్థాపించ‌డం, అదే స‌మ‌యంలో టీఆర్ఎస్ నేత‌గా విజ‌య‌శాంతి కొన్ని విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యంలో చిరంజీవిపై ఆంధ్రానాయ‌కుడ‌ని విజ‌య‌శాంతి ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు.విజ‌య‌శాంతిని ఫ్రీరిలీజ్ ఫంక్ష‌న్‌లో చూడ‌గానే ఆ విమ‌ర్శ‌లన్నీ గుర్తుకొచ్చిన నేప‌థ్యంలో వారిమ‌ధ్య స‌ర‌దా సంభాష‌ణ ప్రేక్ష‌కుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇచ్చింది.