సాహో సూపర్ క్రేజ్.. రిలీజ్ కు ముందే అన్నీ వచ్చేసాయి

తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు… ఇండియా వైడ్ మూవీ లవర్స్ ‘సాహో’ గురించే చర్చించుకుంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. దీంతో పాటు… ఇండియన్ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ చిత్రాల్లో ఒకటి కావడంతో ఈ చిత్రం గురించి ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది.బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ‘సాహో’ మూవీకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ. 320 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రూ. 350 కోట్లతో నిర్మించినట్లు ఇటీవల ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నిర్మాతలకు పెట్టుబడి దాదాపుగా తిరిగి వచ్చిందని చర్చించుకుంటున్నారు.


‘సాహో’ మూవీ పక్కా ప్రాఫిటబుల్ వెంచరే అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తోంది. నిర్మాతలు పెట్టిన పెట్టుబడి ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా మాగ్జిమమ్ తిరిగొచ్చిందని, రిలీజ్ తర్వాత సినిమా సూపర్ హిట్ టాక్ వస్తే వారి ఖాతాలో భారీ లాభాలు పడటం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇంకా ‘సాహో’ మూవీకి సంబంధించిన శాటిలైట్ రైట్స్, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమ్మాల్సి ఉంది. వివిధ భాషల్లో వస్తున్న సినిమా కాబట్టి వీటి రూపంలో రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు ఆధాయం వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటి వరకు ఇండియన్ సినీ చరిత్రలో అతిపెద్ద విజయాలు అంటే దంగల్, బాహుబలి 2, పికె లాంటి చిత్రాలు ఉన్నాయి. వీటిని వెనక్కి నెట్టుదామని ఇటీవల రజనీకాంత్ 2.0 సినిమా వచ్చింది కానీ ఫెయిల్ అయింది. అయితే ‘సాహో’ చిత్రం విజయం స్థాయి ఏ స్థాయిలో ఉంటుంది? ప్రభాస్ గత చిత్రం బాహుబలి రికార్డులను ఇది అందుకుంటుందా? అనేది చర్చనీయాంశం అయింది.


ఆగస్టు 30న సాహో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హీరోయిన్ శ్రద్ధా కపూర్‌తో పాటు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మహేష్ మంజ్రేకర్, మందిరా బేడీ తదితరులు నటిస్తున్నారు. సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అన్ని భాషల నుంచి నటీ నటులను ఎంపిక చేశారు.