ఒప్పొ కొత్త ఫోన్.. అందుబాటు ధరలో అదిరే ఫీచర్లు

ప్రత్యర్థులతో పోటీ పడేందుకు ఒప్పొ రెడీ అవుతోంది. అందులో భాగంగానే మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను దేశీ మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమౌతోంది. ఒప్పొ కే3 పేరుతో కొత్త ఫోన్‌ను అతిత్వరలోనే కస్టమర్ల ముందుకు తీసుకురానుంది. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ఒప్పొ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. దీని పేరు ఒప్పొ కే3. ఈ-కామర్స్ దిగ్గజమైన అమెజాన్‌లో ఫోన్ టీజర్ పేజ్ గమనించొచ్చు.

ఒప్పొ కే3 స్మార్ట్‌ఫోన్ అతిత్వరలోనే జూలై 19న మార్కెట్‌లోకి రానుంది. ఫోన్‌లో ఆమ్‌లెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్. గేమ్ బూస్ట్ 2.0 మోడ్ వంటి ప్రత్యేకతలు ఉండొచ్చు.ఒప్పొ కొత్త ఫోన్ పేరు కే3 అని కంపెనీ ప్రకటించలేదు. అయితే టీజర్ పేజ్‌లో కంపెనీ 3.0 అని పేర్కొంది. దీని ఆధారంగా చూస్తే ఫోన్ పేరు ఒప్పొ కే3 అని భావించొచ్చు. కంపెనీ ఈ ఫోన్‌ను చైనాలో మే నెలలోనే లాంచ్ చేసింది.

ఒప్పొ కొత్త ఫోన్‌లో 6.5 అంగుళాల స్క్రీన్, హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్, 3765 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.ఫోన్‌లో ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఇందులో డ్యూయెల్ రియర్ కెమెరా ఉంటుంది. ఒకటేమో 16 ఎంపీ కెమెరా. రెండోదేమో 2 ఎంపీ కెమెరా. కంపెనీ ఇక ఫోన్ ముందు భాగంలో 16 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరాను అమర్చింది.అలాగే ఫోన్‌లో వోక్ 3.0 ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది. ఫోన్ 6 జీబీ/8 జీబీ ర్యామ్, 64 జీబీ/128 జీబీ/256 జీబీ మెమరీ ఆప్షన్లలో లభ్యంకానుంది. దీని ధర రూ.16,000.