‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ మూవీ రివ్యూ & రేటింగ్

హీరో సందీప్‌కిష‌న్ మంచి విజ‌యం కోసం చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్యామిలీ జోన‌ర్ సినిమాలు, మాస్ సినిమాలు చేసిన సందీప్, తొలిసారి హార‌ర్ థ్రిల్ల‌ర్ `నిను వీడ‌ని నీడ‌ను నేనే` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. నీడ నిన్ను వెంటాడితే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో ప్ర‌మోష‌న్స్ కూడా చేసింది చిత్ర యూనిట్‌. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగానే సినిమాలు చేసిన సందీప్ కిష‌న్ ఈసారి నిర్మాత‌గానూ మారాడు. `నినువీడ‌ని నీడ‌ను నేనే` సినిమా ప‌క్కా హిట్ అవుతుంద‌ని బ‌ల్ల గుద్ది మ‌రీ చెప్పాడు సందీప్‌. మ‌రి సందీప్ న‌మ్మ‌కం నిజమైందా? త‌ను తొలిహిట్‌ను సాధించాడా? లేదా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా కథేంటోచూద్దాం.

బ్యాన‌ర్స్‌: వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్

న‌టీన‌టులు: సందీప్ కిష‌న్‌, అన్య‌సింగ్‌, వెన్నెల‌కిశోర్‌, మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, మాళ‌వికా నాయ‌ర్‌, ముర‌ళీశ‌ర్మ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, మ‌హేశ్ విట్టా, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు

సంగీతం: ఎస్.ఎస్. తమన్

ఛాయాగ్రహణం: ప్రమోద్ వర్మ

ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్

ఆర్ట్ డైరెక్టర్: విదేష్

ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ చెర్రీ సీతారామ్, కిరుబాక‌ర‌న్‌

నిర్మాతలు: దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్

దర్శకుడు: కార్తీక్ రాజు

క‌థ‌:

కోపం ఎక్కువ‌గా ఉండే యువ‌కుడు రిషి(సందీప్ కిష‌న్‌), త‌న క్లాస్‌మేట్ దియా(అన్య‌సింగ్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఇద్ద‌రూ ఎంతో సంతోషంగా ఉంటారు. ఓసారి అనుకోకుండా రోడ్డు ప్ర‌మాదం జ‌రుగుతుంది. యాక్సిడెంట్ అయిన కారు నుండి ఇద్ద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చి ప‌క్క‌నున్న శ్మ‌శానం వైపు వెళ‌తారు. కానీ దియా భ‌య‌ప‌డ‌టంతో ఇద్ద‌రు ఇంటికి వ‌చ్చేస్తారు. కానీ ఇంటికి వ‌చ్చిన త‌ర్వాత అద్దంలో త‌మ స్థానంలో మ‌రొక‌రు క‌న‌ప‌డ‌తారు. భార్యాభ‌ర్త‌లిద్ద‌రికీ అలా జ‌రిగే స‌రికి ఏం చేయాలో అర్థం కాదు. అదే సమ‌యంలో దియా అత్త‌గారు(ప్ర‌గ‌తి) త‌మ కోడలి స్థానంలో మ‌రో అమ్మాయి అద్దంలో క‌న‌ప‌డ‌టాన్ని చూసి డాక్ట‌ర్(ముర‌ళీశ‌ర్మ‌)ను క‌లుస్తుంది. డాక్ట‌ర్ ఇద్ద‌రి శ‌రీరాల్లో దెయ్యాలున్నాయ‌ని గ్ర‌హిస్తాడు. కానీ ఆ దెయ్యాలెవ‌రు? అని క‌నుగొనే ప్ర‌య‌త్నంలో పోలీసుల‌ను కూడా ఆశ్ర‌యిస్తారు. పోలీసుల‌కు రోడ్డు ప్ర‌మాదంలో అర్జున్, మాధ‌వి అనే యువ‌జంట చ‌నిపోయార‌ని తెలుస్తుంది. కానీ అక్క‌డే అస‌లు ట్విస్ట్ రివీల్ అవుతుంది…. అదేంటంటే రిషి అస‌లు పేరు అర్జున్‌,దియా అస‌లు పేరు మాధ‌వి అని తెలుస్తుంది. అస‌లు అర్జున్, మాధ‌వి.. రిషి, దియా అనే పేర్ల‌తో ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తుంటారు. వాళ్లెందుకు చనిపోతారు? చివ‌ర‌కు క‌థ ఎలాంటి మ‌లుపులు తీసుకుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:

సినిమా తొలి ప‌దినిమిషాలు నార్మ‌ల్‌గానే న‌డుస్తుంది. యాక్సిడెంట్ అయిన త‌ర్వాత క‌థ అస‌లు మ‌లుపు తీసుకుంటుంది. అక్క‌డే నుండి ఒక‌రి స్థానంలో మ‌రొక‌రు క‌న‌డ‌ప‌డతారు. అస‌లెందుకు? అనే పాయింట్‌తో సినిమా ర‌న్ అవుతుంది. తొలి పార్ట్‌లో మెయిన్ లీడ్స్‌గా న‌టించిన సందీప్ కిష‌న్‌, అన్య‌సింగ్ భ‌య‌ప‌డుతుంటారు. ఆ స‌న్నివేశాలు హార‌ర్ పంథాలో చిత్రీక‌రించారు. ఇక పోలీసాఫీస‌ర్‌గా ఏం పోలీసులు మ‌నుషులు కారా? వాళ్ల‌కేమైనా దెయ్యాలను ప‌ట్టుకోవ‌డంలో స్పెష‌ల్ ట్ర‌యినింగ్ ఇస్తారా? ఈ క‌ష్టం పాకిస్థాన్ పోలీసోడుకి కూడా రాకూడ‌దు.. వంటి డైలాగ్స్‌తో త‌న‌దైన బాడీ లాంగ్వేజ్‌లో పోసాని కృష్ణ‌ముర‌ళి పాత్ర ద్వారా క్రియేట్ అయిన కామెడీ ప్రేక్ష‌కులను న‌వ్విస్తుంది. ఇక ముర‌ళీ శ‌ర్మ పాత్ర సీరియ‌స్‌గా అస‌లేం జ‌రిగింద‌నేది తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. ఇక సందీప్‌కిష‌న్‌గా క‌న‌ప‌డే వెన్నెల‌కిశోర్ త‌న హావ‌భావాల‌తో న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక ఫ‌స్టాఫ్‌లో అద్దంలో క‌న‌ప‌డే హీరో, హీరోయిన్స్ మీద‌నే ట్విస్ట్ తీసుకుని ముగుస్తుంది. ఇక అక్క‌డ నుండి హీరో ఎందుకు చనిపోయానా? యాంగిల్‌తో పాటు హీరో మ‌రొక‌రి శ‌రీరంలో ఉండ‌టం వ‌ల్ల ఆ శ‌రీరానికి సంబంధించిన మెద‌డు ప‌డే ఘ‌ర్షణ వ‌ల్ల బ్ర‌తికి ఉన్న ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది. అనే మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించారు. చివ‌ర‌కు అస‌లు హీరోకు యాక్సిడెంట్ ఎందుకు జ‌రిగింద‌నేదాన్ని పోలీసులు చేధించ‌డంతో దెయ్యం ఆత్మ శాంతిస్తుంది. అలాగే ఇంట్లో పెద్ద‌వాళ్ల‌ను ఎదిరించి పెళ్లిచేసుకున్న ఆత్మ‌లు రెండూ వారి పెద్ద‌వాళ్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి త‌ప్పుల‌ను ఒప్పుకోవ‌డం.. అనే కాన్సెప్ట్‌ను బేస్ చేసుకుని ఓ ఎండింగ్ ఇచ్చారు. సెకండాఫ్‌లో సెంటిమెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. త‌ల్లికొడుకులు, తండ్రి కూతుళ్ల సెంటిమెంట్‌ను ఓ సాంగ్‌లో చూపించారు. ఇక హీరో ప్ర‌మాదంలో ఎలా చ‌నిపోయాడు? ఎందుకు ఆ ప్ర‌మాదం జ‌రిగింద‌నే విష‌యాన్ని పోలీసుల కోణంలో క్లోజ్ చేశారు. ఇక ప్ర‌గ‌తి, మ‌హేశ్ విట్టా, పూర్ణిమ భాగ్యరాజ్, మాళ‌వికా నాయ‌ర్ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక సాంకేతికంగ చూస్తే డైరెక్ట‌ర్ కార్తీక్ రాజు యాక్సిడెంట్స్ అనేవి జీవితాల‌ను ఎలా మార్చేస్తాయి. వాటి వ‌ల్ల ఎవ‌రెవ‌రు ఇబ్బందులు ప‌డ‌తారు అనే విష‌యాన్ని ఎమోష‌న‌ల్ యాంగిల్‌లో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఫ‌స్టాఫ్‌లో అస‌లేం జ‌రిగింద‌నేది రివీల్ చేయ‌కుండా ఆస‌క్తిక‌రంగా తెరకెక్కించారు. సినిమాలో సెకండాఫ్ అంతా సైన్స్‌, ఎమోష‌న్స్‌తో క‌ల‌గ‌లిసి ఉండ‌టం అనే అంశాలు .. యూత్‌ను ఏమేర ఆక‌ట్టుకుంటాయ‌ని చెప్ప‌లేం. ఇక త‌మ‌న్ అందించిన సంగీతం, నేప‌థ్య సంగీతం బావుంది. ప్ర‌మోద్ వ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. నిర్మాత‌గా తొలి ప్ర‌య‌త్నంలో సందీప్ మేకింగ్ ప‌రంగా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను తెర‌కెక్కించారు. సైన్స్‌కు కూడా అంద‌ని కొన్ని విష‌యాలు జ‌రిగిన‌ట్లు కొన్ని సంద‌ర్భాల్లో జ‌రిగిన‌ట్లు మ‌నం ఎక్క‌డో వినే ఉండొచ్చు.. చ‌దివి కూడా ఉండొచ్చు. అలాంటి ఓ ఘ‌ట‌న‌ను బేస్ చేసుకుని తెర‌కెక్కిన చిత్ర‌మే `నిను వీడ‌ని నీడ‌ను నేనే`.

బోట‌మ్ లైన్‌: `నిను వీడ‌ని నీడ‌ను నేనే`… రోడ్డు ప్రమాదాల‌పై అవ‌గాహ‌న క‌లిగిస్తూ.. జాగ్ర‌త్త‌లు పాటించ‌మ‌ని చెప్పే చిత్రం

రేటింగ్‌: 2.5/5