వామ్మో నయన్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా..? భారీగా పెంచేసిన రెమ్యూనిరేషన్

వుడ్డులు ఏవైనా హీరోయిన్లకు కొరత లేదు. బోలెడంతమంది ఉంటారు. కానీ.. వారందరిలోకి భిన్నం నయనతార. సినిమాలో నా పాత్రకు ప్రాధాన్యం ఉండాలి. భారీ రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే. అన్నింటికి మించి సినిమాలో యాక్ట్ చేయటమే తప్పించి.. సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్ యాక్టివిటీస్ లో పాల్గొనను. చివరకు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వను. ఇలాంటి కండీషన్లు పెట్టే ఏ హీరోయిన్ అయినా ఇండస్ట్రీలో ఉంటుందా? అంటే.. దానికి సమాధానం నయనతారగా చెప్పాలి.

వరుస విజయాలతో దూసుకెళుతూ.. చేతి నిండా ప్రిస్టేజియస్ ప్రాజెక్టుల్లో చేస్తున్న నయన్ తెలుగులో చేసిన సైరా విడుదలకు సిద్ధమవుతుండగా.. తమిళంలో నెట్రిక్కన్ తో పాటు పలు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా నయన్ రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.కండిషన్ల క్వీన్ గా ఇండస్ట్రీలో అభివర్ణించే నయనతార.. తాజాగా తన రెమ్యునరేషన్ రూ.6 కోట్లకు పెంచేసినట్లుగా చెబుతున్నారు. ఇదో రికార్డుగా పలువురు అభివర్ణిస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం పయ్యా సినిమాకు కోటి రెమ్యునరేషన్ డిమాండ్ చేసి వార్తల్లోకి ఎక్కటమే కాదు.. ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. అలాంటి నయన్ తాజాగా తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ.. ఇండస్ట్రీలోని హీరోయిన్ల రెమ్యునరేషన్ రేంజ్ ను భారీగా పెంచేలా చేసిందంటున్నారు.

భారీ రెమ్యునరేషన్ అంతకు మించి కండిషన్లు పెట్టే నయనతార కున్న డిమాండ్ ఇప్పుడు చర్చగా మారింది. ఇండస్ట్రీని హీరోలే రాజ్యమేలాలా? అన్న ప్రశ్నకు నయనతార లాంటోళ్లు సమాధానమవుతారని చెప్పక తప్పదు. ఏమైనా.. హీరోలతో పోటీ పడేలా రెమ్యునరేషన్ పెంచే నయన గట్స్ ను మెచ్చుకోవాల్సిందే.