మైక్రోమాక్స్ అదిరే ఆఫర్.. తక్కువ ధరకే కే వాషింగ్ మెషీన్లు

మైక్రోమ్యాక్స్ స్పీడ్ పెంచింది. తాజాగా కొత్త ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. దీని ధర కేవలం రూ.10,999 నుంచి ప్రారంభమౌతోంది. కంపెనీ వాషింగ్ మెషీన్‌తోపాటు కొత్త స్మార్ట్ టీవీలను కూడా లాంచ్ చేసింది. మైక్రోమ్యాక్స్ జోరు మీదుంది. కార్యకలాపాలు విస్తరిస్తూ ముందుకు కదులుతోంది. తాజాగా కొత్త స్మార్ట్ టీవీలను మార్కెట్‌లో లాంచ్ చేసింది. అలాగే వీటితోపాటు ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ను కూడా ఆవిష్కరించింది. కంపెనీ నుంచి మార్కెట్‌లోకి వచ్చిన తొలి ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ ఇదే కావడం గమనార్హం.

కంపెనీ తొలి ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్. దీని ధర రూ.10,999. జూలై 15 నుంచి కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ఇవి కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి.వాషింగ్ మెషీన్లు నాలుగు వేరియంట్ల రూపంలో లభ్యమౌతాయి. 6 కేజీ, 6.5 కేజీ, 7 కేజీ, 8 కేజీ అనే సామర్థ్యంతో ఇవి అందుబాటులో ఉంటాయి.కంపెనీని స్థాపించిన దగ్గరి నుంచి మా లక్ష్యం ఒక్కటే. తక్కువ ధరకే సరికొత్త టెక్నాలజీతో ప్రొడక్టులను అందించాలని ముందుకు వెళ్తున్నాం. అందుకే ఇప్పుడు తొలి వాషింగ్ మెషీన్‌ను ఆవిష్కరించాం. దీంతో కస్టమర్ల దైనందిన కార్యకలాపాలు సులభతరమౌతాయి’ అని మైక్రోమ్యాక్స్ ఇన్‌ఫర్మేటిక్స్ డైరెక్టర్ రోహన్ అగర్వాల్ తెలిపారు.

మరోవైపు కంపెనీ తన తొలి వాషింగ్ మెషీన్‌తో కొత్త ఆండ్రాయిడ్ టీవీలను మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఇవి 32, 40, 43 అంగుళాల స్క్రీన్ పరిమాణంలో కస్టమర్లకు జూలై 11 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ టీవీల ధర రూ.13,999 నుంచి ప్రారంభం కావొచ్చు.