మెగా బ్రదర్ కు కొత్త తలనొప్పి.. అయోమయంలో నాగబాబు

నాగబాబు అంటే సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా బాగా ఫేమస్. కానీ ఇప్పుడు ఈయన మరో చోట కూడా తాను ఫేమస్ అంటున్నాడు.. అక్కడ క్రేజ్ తెచ్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. దానికి తమ్ముడు పవన్ కల్యాణ్ సాయం కూడా తీసుకుంటున్నాడు. అయినా కూడా వర్కవుట్ కావడం లేదు.. ఎక్కడా చిన్న గుర్తింపు కూడా రావడం లేదు.. అదే రాజకీయ రణరంగం. అక్కడ నాగబాబు ఎంత ట్రై చేసినా కూడా మనోడి జాతకం అస్సలు మారడం లేదు. ఎంత చేసినా.. ఏం చేసినా.. ఎంత మాట్లాడినా కూడా నాగబాబుకు పొలిటికల్‌గా కోరుకున్న గుర్తింపు మాత్రం రావడం లేదు.తమ్ముడు పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి తన గళం విప్పుతున్నాడు మెగా బ్రదర్. హాయిగా చిరంజీవి సినిమాలు చేసుకుంటూ ఉంటే తమ్ముళ్లు మాత్రం పొలిటికల్ అంటూ తిరుగుతున్నారు.

అందులోనూ పవన్ రాజకీయంగా తనదైన ముద్ర కోసం చూస్తున్నాడు. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా ఈయన తన మార్క్ చూపిస్తాడని అభిమానులు నమ్ముతున్నారు. కానీ తమ్ముడు చాటులో నాగబాబు మాత్రం ఏం చేస్తాడనేది ఎవరికీ అర్థం కావడం లేదు. మొన్నటికి మొన్న జనసేన నుంచి ఎంపిగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయాడు మెగా బ్రదర్.ఆ తర్వాత కూడా బయటికి వచ్చి మీటింగ్స్‌లో మాట్లాడుతున్నాడు కానీ అవి అంతగా వర్కవుట్ కావడం లేదు. దాంతో రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయాడు ఈ నటుడు. అందుకే ఈ మధ్యే లుక్ మార్చి.. జబర్దస్త్ షోతో పాటు మరిన్ని సినిమాలు కూడా చేయడానికి ఫిక్సైపోయాడు. ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకొస్తావా అన్నట్లుంది ఇప్పుడు నాగబాబు పరిస్థితి. ఆయన రెండు పడవల ప్రయాణంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడని సన్నిహితులు చెబుతున్న మాట.ఎంతైనా తమ్ముడు కదా..

అంత ఈజీగా వదిలేయలేడు.. పోనీ అక్కడే ఉండి విజయం సాధించగల నమ్మకం ఉందా అంటే అది కూడా అనుమానంగానే కనిపిస్తుంది.ఇంకో నాలుగేళ్ల వరకు ఎన్నికలు రావు. అప్పటి వరకు ఈ అరకొర మీటింగ్స్‌తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. దాంతో రాజకీయంగా నాగబాబు శూన్యంలోనే ఉన్నాడు ప్రస్తుతానికి. మరి వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుందో చూడాలిక.

 

Recommended For You

Leave a Reply

Your email address will not be published.