మీ హెయిర్ అప్పుడే తెల్లబడుతోందా.. అలివ్ ఆయిల్ తో ఇలా ట్రై చేయండి

జుట్టు రాలిపోవడం, తెల్లబడటం వంటి సమస్యలకు ఆలివ్ ఆయిల్ చక్కటి పరిష్కారం ఇస్తుంది. ఆయుర్వేదంలో కూడా ఆలివ్ ఆయిల్‌కు ప్రాధాన్యత ఉంది. దీన్ని వాడటం ద్వారా జుట్టు సమస్యలకు చెక్ పెట్టేయొచ్చు ఇటీవల కాలంలో నిండా పాతికేళ్లు రాకముందే జుట్టు ఊడిపోవడం, తెల్లబడిపోవడం సమస్యలతో యువతరం సతమతమవుతోంది. అబ్బాయిలేమో బట్టతల వచ్చేసిందని నలుగురిలోకి వెళ్లేందుకు ఆలోచిస్తుంటే, అమ్మాయిలేమో జుట్టు పలుచగా మారిపోయిందని డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. జుట్టు సమస్యలకు ఎన్నో చిట్కాలు ప్రయోగించి విసిగిపోతుంటారు. అయితే జుట్టు సమస్యలతో బాధపడేవారు ఆందోళన చెందకుండా ఆలివ్ అయిల్‌ వాడితే పరిష్కారం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

ఆలివ్‌ నూనెలో ఉండే విటమిన్‌-ఇ, ఇతరత్రా యాంటీఆక్సిడెంట్లు తలమీద ఉన్న చర్మాన్ని మృదువుగా చేస్తాయి. దాంతో మర్దన చేయడం వల్ల జుట్టు పొడిబారిపోవడం, తెల్లబడటం, వంటి సమస్యలు తగ్గడంతోబాటు కుదుళ్లు దృఢంగా మారతాయి.చుండ్రు కారణంగా పొడిబారిపోయిన జుట్టుకి ఆలివ్‌నూనెతో మర్దన చేయడం వల్ల మంచి పలితం ఉంటుంది. ఆలివ్‌ నూనెతో మర్దన చేయడం వల్ల ఎండవేడిమి కారణంగా ఆగిపోయిన మెలనిన్‌ వర్ణద్రవ్యం తిరిగి ఉత్పత్తి అయి కురులు నల్లగా నిగనిగలాడతాయి. రసాయనాలు కలిసిన షాంపూలు వాడటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. అలాంటప్పుడు ఆలివ్‌ నూనెతో బాగా మర్దన చేసి అరగంటసేపు తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుమూడు సార్లు చేయడం వల్ల ఫలితం ఉంటుంది.

నాలుగుచుక్కల అల్లం రసంలో కొద్దిగా ఆలివ్‌నూనె చేర్చి జుట్టు కుదళ్లకు పట్టించాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లు దృఢంగా మారతాయి.ఆలివ్‌ ఆయిల్‌ను వేడిచేసి వెంట్రుకల కుదుళ్ళకు పట్టించి 10-15 పదిహేను నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.ఆలివ్ ఆయిల్‌లో వెల్లుల్లి పొట్టును కాల్చిన పొడిని కలిపి తలకు రాసుకుంటే జుట్టు త్వరగా నెరవదు. ఆలివ్‌ ఆయిల్‌లో కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి, తలకు రాచుకుని కాసేపటి తర్వాత తలస్నానం జుట్టు మెత్తగా మారుతుంది. త్వరగా రాలదు కూడా.