మన్మదుడు 2 అచ్చం అన్నమయ్య లాగే.. నాగార్జున మాటలకు బిత్తరపోయిన అభిమానులు

రొమాంటిక్ హీరోగా తెలుగు తెరపై నాగార్జునకు మంచి పేరుంది. మన్మథుడి వంటి పాత్రలను పోషిస్తూనే.. ఆ ట్రెండ్ ను బ్రేక్ చేస్తూ ఆయన అన్నమయ్య వంటి భక్తి రస చిత్రాల్లో కూడా నటించారు. ఆ తర్వాత శ్రీరామదాసు పాత్రలోనూ అద్భుత నటనతో మంచి విజయం అందుకున్నారు. తనతో పాటు వచ్చిన అందరు హీరోలూ క్రమంగా ఫేడ్ అవుట్ అవుతున్నా.. ఇంకా రొమాంటిక్ లుక్ తో నాగార్జున తన ప్రత్యేకత నిలుపుకుంటున్నాడు.తాజాగా నాగార్జున నటించిన మన్మథుడు 2 విడుదలైంది. కానీ సినిమాకు అంత మంచి టాక్ రాలేదు. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని అన్ని ప్రాంతాల నుంచి వార్తలు వస్తున్నాయి.

ఈ సమయంలో ఆ సినిమాను నిలబెట్టేందుకు నాగార్జున టీమ్ ప్రయత్నిస్తోంది.ఈ సినిమా సక్సెస్ పై ప్రెస్ మీట్ పెట్టిన నాగార్జున ఓ వింత లాజిక్ వినిపించారు. గతంలోనూ తన సినిమాలు కొన్ని చాలా స్లోగా ప్రేక్షకులకు ఎక్కాయని.. ఇదీ అంతే అన్న విధంగా మాట్లాడారు.ఆయన ఏమన్నారంటే.. నేను ఎప్పుడూ నా కెరీర్‌లో కొత్తదనం చూపించాలనుకున్నాను. ఒకే టైప్ సినిమాలు చేస్తున్నప్పుడు నాకు నచ్చట్లేదు, అలాగే యూత్‌కి కూడా నచ్చడం లేదని ఏదో చేయాలని `గీతాంజలి` సినిమా చేశాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా యాక్సెప్ట్ చేయడానికి చాలా సమయం పట్టింది. శివ అయిన తర్వాత నిర్ణయం చేశాను. ఇప్పుడు నిర్ణయం చిత్రాన్ని మంచి సినిమా అంటారు. కానీ సినిమాకు మేం పడ్డ తిప్పలు మాకే తెలుసు.అన్నమయ్య సినిమా 8వ రోజు కలెక్షన్స్ రెంట్స్ కూడా కట్టలేని పరిస్థితికి చేరుకున్నాయి. నేను, రాఘవేంద్రరావు, దొరస్వామిరాజుగారు చాలా బాధపడ్డాం. చాలా మంచి సినిమా చేశామనుకున్నాం. అప్పుడు ఓ టూర్ వెళ్లినా కూడా వర్కవుట్ కాలేదు.

అయితే 11వ రోజు.. ఏం జరిగిందో ఏమో కానీ.. మ్యాట్నీ నుండి అన్ని థియేటర్స్ హౌస్‌ఫుల్స్ అయ్యాయి. ఆ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో అందరికీ తెలుసు. మన్మథుడు 2`ని ప్రేక్షకులు వెంటనే యాక్సెప్ట్ చేయలేరు. కాస్త సమయం తీసుకుంటుంది. కలెక్షన్స్ చూసి చాలా సంతోషమేసింది. అందరూ ఫోన్స్ చేసి అభినందిస్తున్నారు.. అంటూ తన అభిప్రాయాలు పంచుకున్నారు నాగార్జున.