అంత రిస్క్ అవసరమా మణిరత్నం.. జక్కన్నను ఫాలో అవుతున్నాడా..?

‘బాహుబలి’ సాధించిన అద్భుత విజయం చూసి తామూ అలాంటి సినిమా తీయాలని చాలామంది ప్రయత్నించారు. తమిళంలో ‘పులి’ అలాంటి ప్రయత్నమే. కానీ అది డిజాస్టర్ అయింది. సీనియర్ దర్శకుడు సుందర్ ‘సంఘమిత్ర’ పేరుతో ‘బాహుబలి’ని మించే సినిమా తీయాలనుకున్నాడు. వర్కవుట్ కాలేదు. జానర్ వేరైనప్పటికీ ‘2.0’తో ‘బాహుబలి’ని బీట్ చేయాలని చూశాడు శంకర్. కానీ అదీ ఫలితాన్నివ్వలేదు.

బాలీవుడ్లో కూడా ఇలాంటి భారీ ప్రయత్నాలు జరిగాయి. తెలుగులో ‘సాహో’, ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి సినిమాలు కూడా ‘బాహుబలి’ని టార్గెట్ చేసినవే. ఈ సినిమాలన్నీ బడ్జెట్, భారీతనంలో ‘బాహుబలి’ని మ్యాచ్ చేయడానికి ప్రయత్నించాయి కానీ.. ఆ స్థాయి అనుభూతిని మాత్రం ప్రేక్షకులకు ఇవ్వలేకపోయాయి. విజయాలూ సాధించలేకపోయాయి. అయినప్పటికీ ‘బాహుబలి’ తరహా భారీ ప్రయత్నాలు మాత్రం ఆగట్లేదు.ఇప్పుడు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సైతం ‘బాహుబలి’ లైన్లోనే తన కొత్త చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చారిత్రక నవల ‘పొన్నియన్ సెల్వన్’ ఆధారంగా మణిరత్నం తన కొత్త చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం త్వరలోనే థాయిలాండ్‌లో భారీగా విస్తరించిన అడవుల్లో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఈ సినిమా కోసం ఏడాదిగా ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

‘బాహుబలి’కి ఏమాత్రం తీసిపోని భారీతనం, కాస్టింగ్, ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాను రూపొందించనున్నాడట మణిరత్నం. అంతే కాదు.. ‘బాహుబలి’ లాగే రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతుందట. మరో నిర్మాతతో కలిసి సొంత నిర్మాణ సంస్థలో మణిరత్నం ఈ చిత్రం చేయనున్నాడు. చోళుల కాలం నాటి ఒక రాజు కథతో ఈ సినిమా తెరకెక్కనుందట. విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ, అదితిరావు హైదరి, మోహన్ బాబు, కీర్తి సురేష్.. ఇలా భారీ తారాగణమే ఉంది ఈ చిత్రంలో. వచ్చే ఏడాది దీపావళికి ‘పొన్నియన్ సెల్వన్’ తొలి పార్ట్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం.