వైసిపికి దడ పుట్టిస్తున్న పాల్ పార్టీ.. జనసేన కూడా!

జనసేన గురించి తర్వాత మాట్లాడుకుందాం… కెఏ పాల్ పార్టీ వైసిపికి దడ పుట్టించడమా? ‘జబర్దస్త్’ స్కిట్స్‌లా కుళ్ళు జోకులేస్తున్న కెఏ పాల్… దాదాపు పదేళ్ళ చరిత్ర కలిగిన జగన్ పార్టీని దడ పుట్టించడమంటే పెద్ద కామెడీగానే అనిపిస్తుంది. కానీ ఇది అక్షరాల నిజం! అదెలా అనుకుంటున్నారా? ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి.

కెఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీకి ఎలెక్షన్ కమిషన్ కేటాయించిన హెలికాప్టర్ గుర్తు వైసిపికి మొదటినుంచీ తలనొప్పిగా మారింది. ఎందుకంటే… ఈసీ జాబితాలో హెలికాప్టర్ రెక్కలు, దాదాపు ఫ్యాన్ రెక్కల్లాగే స్పష్టంగా ఉన్నాయి. దీంతో ఓటర్లు కచ్ఛితంగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే… పాల్ పార్టీకి కేటాయించిన గుర్తుపై వైసిపి ఫిర్యాదులు చేస్తూ వస్తోంది. ఇదే పెద్ద సమస్య అనుకుంటే… దీనికిమించిన మరో గండం వైసిపికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దాదాపు 35 నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్థుల పేర్లతో ప్రజాశాంతి అభ్యర్థుల పేర్లు సరిగ్గా పోలి ఉన్నాయి. ఆ పేర్ల పరంగానూ ఓటర్లు అయోమయానికి గురై… ఓట్లు తారుమారయ్యే ఛాన్స్ ఉంది. దీంతో వైసిపి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.

ఇక జనసేన విషయానికొస్తే… ఎన్నికల షెడ్యూల్ వరకు మౌనంగా ఉన్న పవన్ ఆ తర్వాత ఒక్కసారిగా జోష్ పెంచేశారు. ఆ దెబ్బతో ఆయనకు అనుకూల పవనాలు వీయడంతో… వైసిపికి చెందిన నేతలు చాలామంది జనసేనలోకి జంప్ అయ్యారు. ముఖ్యంగా.. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన తరుపున నిలబడిన అభ్యర్ధుల్లో దాదాపు సగానికిపైగా వైసీపీ నేతలే! కృష్ణా జిల్లాలోనూ అదే పరిస్థితి! వాళ్లంతా జగన్‌ని టార్గెట్ చేసి కొన్ని సంచలన రహస్యాల్ని బయటపెడుతున్నారు. అవి కచ్ఛితంగా ఎన్నికల సమయంలో వైసిపిపై ప్రభావం చూపడం ఖాయం! టిడిపిని ఎదుర్కొంటే చాలనుకున్న జగన్‌కు.. ఇప్పుడు పాల్, పవన్‌ల ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.