కేఏ పాల్ గా సునీల్ . బయోపిక్ తీస్తున్నారా..!

క్రైస్తవ మత ప్రభోదకుడు కె.ఏ.పాల్ బయోపిక్ తెరకెక్కనుందా? ఆయన బయోపిక్ లో కమెడియన్ టర్న్ డ్ హీరో సునీల్ నటించనున్నారా? అంటే అవుననే ఇటీవల ప్రచారం సాగుతోంది. పాల్ వ్యవహార శైలి గురించి తెలుగు ప్రజలకు తెలిసిందే. మొన్న ఎలక్షన్ స్టంట్ లో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించి ఆయన చేసిన హడావుడిని ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోలేరు. పాల్ వింత చేష్టలు .. విచిత్రమైన డైలాగులు.. ఓ రేంజులో కామెడీని పండించాయి. సీరియస్ పొలిటికల్ గేమ్ లో ఆయనో రిలీఫ్ అంటూ వ్యాఖ్యానించడం ఆసక్తిని కలిగించింది.

ప్రస్తుతం కె.ఏ పాల్ పై తీయబోయే సినిమాలో ఈ ఎపిసోడ్స్ అన్నిటినీ చూపించనున్నారని తెలుస్తోంది. మొన్నటివరకూ పాల్ సినిమా తీస్తున్నారు! అన్న ప్రచారం మాత్రమే సాగింది. తాజాగా అందుకు ప్రూఫ్ గా కొన్ని ఫోటోలు అంతర్జాలంలోకి వచ్చాయి. “కె.ఏ పాల్ పాత్రలో నటించేందుకు సునీల్ ప్రిపరేషన్ సాగిస్తున్నారు. అతడు లాస్ ఏంజెల్స్ కి వెళుతున్నారు. ఇవిగో ఈ ఫోటోలే ప్రూఫ్!“ అంటూ కొన్ని ఫోటోలు బయటికి వదిలారు. కె.ఏ పాల్ గా సునీల్ రూపాన్ని ప్రోస్థటిక్స్ లో మార్చాక ఆ ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లోకి రివీల్ చేస్తామన్న క్లూ కూడా ఈ ఫోటోల ద్వారా ఇవ్వడం ఆసక్తిని పెంచుతోంది. ఆయనపై సినిమా తీసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడీ అవుతోందని ప్రచారమవుతోంది.

అయితే ఈ ప్రచారంలో నిజం ఎంత? నిజంగానే పాల్ బయోపిక్ తీస్తున్నారా? ఇది ఆయన పూర్తి జీవితకథనా? లేక కేవలం కామెడీ ఎపిసోడ్స్ తో మాత్రమే తీస్తున్నారా? అయినా తనపై సినిమా తీస్తున్నానని అడిగితే పాల్ ఒప్పుకుంటారా? ఇలాంటి సందేహాలెన్నో. అసలే బయోపిక్ లు అంటేనే వివాదాల్ని మోసుకొస్తున్నాయి.. కాబట్టి ముందస్తుగానే ఈ బయోపిక్ తీయాలనుకుంటే చట్టపరంగా ఇబ్బందులు తలెత్తకుండా చాలానే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.