తారక్ చేయబోయే నెక్స్ట్ మూడు సినిమాలు ఇవేనా.. అన్నీ RRR తర్వాతే

జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతోనే మ‌రో ఏడాది పాటు బిజీగా ఉంటాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అక్టోబ‌ర్ వ‌ర‌కే ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ఇద్ద‌ర్నీ వ‌దిలేస్తాన‌ని రాజ‌మౌళి చెబుతున్నా కూడా 2020 జులై 30న సినిమా విడుద‌ల కానుందంటే.. అప్ప‌టి వ‌ర‌కు ఏదో ఓ ప‌ని మీద అక్క‌డే లాక్ చేస్తాడు ద‌ర్శ‌క‌ధీరుడు. దాంతో వ‌చ్చే ఏడాది వ‌ర‌కు RRR త‌ప్ప మ‌రో ధ్యాసే ఉండ‌దు జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు. ఇక రామ్ చ‌ర‌ణ్ ప‌రిస్థితి కూడా అంతే.

అయితే ఇప్పుడు RRR త‌ర్వాత ఎన్టీఆర్ ఏం చేస్తాడు.. ఎవ‌రితో సినిమాలు చేస్తాడు అనేది మాత్రం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం జూనియ‌ర్ త‌ర్వాత మూడు సినిమాలు మాత్రం అగ్ర ద‌ర్శ‌కుల‌తోనే ఉండ‌బోతున్నాయి. ఇప్ప‌టికే వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న ఈయ‌న‌.. RRR త‌ర్వాత కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే ఈ కాంబినేష‌న్ కూడా వ‌ర్క‌వుట్ అయిపోయింది. దీనికి కొర‌టాల స్నేహితుడు నిర్మాత‌గా ఉండ‌బోతున్నాడు. ఈయ‌న త‌ర్వాత అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు.తెలుగు ఇండ‌స్ట్రీకి ఎన్టీఆర్ సినిమాతోనే ఎంట్రీ ఇస్తాడ‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే త‌మిళ‌నాట వ‌ర‌స విజ‌యాల‌తో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. ఇక మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ మ‌ధ్యే కేజీయ‌ఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌తో తాము సినిమా చేయ‌బోతున్నామ‌ని అనౌన్స్ చేసారు.

ఇందులో హీరోగా ఎన్టీఆర్ న‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. మొత్తానికి RRR త‌ర్వాత కొర‌టాల శివ‌, అట్లీ, ప్ర‌శాంత్ నీల్ లాంటి సంచ‌ల‌న ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయ‌డానికి ఎన్టీఆర్ సిద్ధ‌మ‌వుతున్నాడు.