జక్కన్న మాస్టర్ ప్లాన్.. ఇక మెగా, నందమూరి ఫ్యాన్స్ కు అదిరే ట్రీట్

మెగా, నందమూరి అభిమానులకు ఏక కాలంలో స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు దర్శకధీరుడు రాజమౌళి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా RRR. ఈ సినిమాలో మెగా, నందమూరి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. తాజాగా ఇందుకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ తెలిసింది. వివరాల్లోకి పోతే..

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ డాన్సుల్లో ఎవరికీ వారే సాటి. స్పీడ్ డాన్స్ చేస్తూ థియేటర్లలో ఆడియన్స్ చేత కేకలు పెట్టించడం ఈ ఇద్దరికీ వెన్నతో పెట్టిన విద్య. అందుకే వీళ్ళ సినిమాల్లో పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే రాజమౌళి కూడా వెళ్తున్నారనేది తాజా సమాచారం. RRR సినిమాలో ఎన్ని పాటలు ఉంటాయా అనే ఆసక్తి అభిమానుల్లో ఉన్న సంగతి తెలిసిందే. 1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న చారిత్రక సినిమా కావడంతో ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ డాన్సులు మిస్ అవుతామేమో అని భావించారు వారి వారి ఫ్యాన్స్. కానీ మెగా, నందమూరి అభిమానులకు కనువిందు చేసేలా ఏడు పాటలు, హోరెత్తిపోయే డాన్సులు రూపొందిస్తున్నారట జక్కన్న. అందులో దేశభక్తికి సంబంధించి రెండు పాటలు, అలాగే రామ్ చరణ్- ఆలియా భట్ పై రెండు పాటలు, ఎన్టీఆర్‌తో మరో రెండు రొమాంటిక్ సాంగ్స్, అలాగే ఒక ఫోక్ సాంగ్ ఉండేలా రాజమౌళి ప్లాన్ చేశారట. ఈ ఏడు పాటల్లో సుద్దాల అశోక్ తేజ 3 పాటలను రాశారని తెలుస్తోంది. థియేటర్లు హోరెత్తిపోయేలా భారీ హంగులతో ఈ పాటల్లో హీరోలు చేసే డాన్సులు మునుపెన్నడూ చూడని విధంగా ఉంటాయని తెలుస్తోంది.

ఇక ఈ పాటలకు కీరవాణి సమకూర్చుతున్న సంగీతం ప్రేక్షకలోకాన్ని మంత్రముగ్ధులను చేస్తుందని అంటున్నారు. RRR లోని సన్నివేశాల విషయంలో ఎంత శ్రద్ద పెడుతున్నారో.. పాటల విషయంలోనూ అంతే శ్రద్ద తీసుకుంటున్నారట జక్కన్న. సో.. ఈ రకంగా మెగా, నందమూరి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా రాజమౌళి స్కెచ్ వేశారని సమాచారం.
ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తున్నారు. బాలీవుడ్ నటులు ఆలియా భట్, అజయ్ దేవగణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వ‌చ్చే ఏడాది జూలై 30 వ తేదీన భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కానుంది.