దేవిశ్రీని దూరం పెట్టిన చరణ్, చిరు.. అసలు కారణం ఇదేనా..?

మెగా ఫ్యామిలీకి దేవిశ్రీప్రసాద్‌ అదిరిపోయే పాటలు అందించాడు. చిరంజీవి రీఎంట్రీ చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’ అంత పెద్ద హిట్‌ అవడంలో దేవి పాత్ర చాలా వుంది. అలాగే రామ్‌ చరణ్‌ కెరియర్‌లో అతి పెద్ద విజయంగా నిలిచిన ‘రంగస్థలం’ కూడా దేవి పాటల వల్ల రిపీట్‌ వేల్యూ తెచ్చుకుంది. అయితే దేవిశ్రీప్రసాద్‌ని ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఎందుకో ఎంటర్‌టైన్‌ చేయడం లేదు. కారణం ఏమిటనేది తెలియదు కానీ చిరంజీవి తాజా చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ లేకపోవడం చర్చనీయాంశమయింది.

వేరే దర్శకుడి సినిమా అయితే పెద్దగా టాపిక్‌ అయ్యేది కాదు కానీ కొరటాల శివ ఇంతవరకు తీసిన సినిమాలు అన్నిటికీ దేవిశ్రీప్రసాద్‌ సంగీత దర్శకుడు. కానీ ఈసారి ఓపెనింగ్‌లో కూడా దేవి పేరు ప్రకటించలేదు. మిగతా టెక్నీషియన్లని ఫైనలైజ్‌ చేసేసినా దేవిని మాత్రం పిలవలేదు. సాధారణంగా దర్శకుడికి ఒకే సంగీత దర్శకుడితో ర్యాపో వుంటే అతని డెసిషన్‌కే వేల్యూ ఇస్తారు. విచిత్రంగా కొరటాల శివ కూడా అతనికోసం పట్టుబట్టినట్టు లేడు. అలా అని ఈ చిత్రానికి మరో సంగీత దర్శకుడి పేరు కూడా ప్రకటించలేదు. కాబట్టి ఇంకా దేవికి అవుట్‌సైడ్‌ ఛాన్స్‌ అయితే లేకపోలేదు. కానీ ఈపాటికే ఫైనలైజ్‌ అయిపోవాల్సి వుండగా ఎందుకని అతడిని ఓకే చేయలేదనేది మాత్రం అందరూ మాట్లాడుకుంటున్నారు. అన్నట్టు అల్లు అర్జున్‌ కూడా దేవితో పని చేయడానికి ఈమధ్య ఆసక్తి చూపించడం లేదు.