వేడి వేడిగా కాఫీ, టీ తీసుకుంటున్నారా..? క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ

చాలా మందికి ఉదయం లేవగానే కడుపులో వేడి వేడి కాఫీ పడనిదే కనీసం బెడ్ కూడా దిగరు. ఇంకొందరికేమో… గంటకి ఒకసారి కాఫీ తాగకుండా లేరు. అయితే… వేడి వేడిగా కాఫీ తాగితే… క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓ సంస్థ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. చైనాలో జరిగిన పరిశోధన ప్రకారం స్మోకింగ్, ఆల్కహాల్‌కుతోడు టీ, కాఫీలను అతి వేడిగా తాగితే అవి క్యాన్సర్‌కు కాక్‌టెయిల్ అవుతాయంటున్నారు. ఇలాంటివాళ్లలో అన్నవాహిక క్యాన్సర్ రిస్కు ఐదొంతులు ఎక్కువగా ఉంటుంది.

30 నుంచి 79 ఏండ్ల మధ్య వయసున్న దాదాపు 4.50 లక్షల మందితో తొమ్మిదేండ్లపాటు ఈ అధ్యయనం చేశారు.పొగతాగడం, ఆల్కహాల్ అలవాట్లతో పాటు రెగ్యులర్‌గా రోజూ వేడివేడి టీ గానీ కాఫీ గానీ తీసుకునేవాళ్లలో క్యాన్సర్ అవకాశాలు పెరిగినట్టు గమనించారు. వేడిగా ఉండే బేవరేజెస్ వల్ల అన్నవాహిక కణాలు డ్యామేజ్ అయి క్యాన్సర్ కణాలు ఏర్పడటానికి దారితీస్తున్నాయని సౌత్ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కూడా అంటున్నారు.నిజానికి గోరువెచ్చని కప్పు కాఫీ వల్ల ప్రమాదం లేకపోగా లాభాలు కూడా ఉన్నాయి. దీనివల్ల లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 15% తగ్గుతుందని అధ్యయనంలో తేలింది.