దేవీశ్రీ పెళ్ళేప్పుడో.. మిగిలింది ఆయన ఒక్కడే..!

టాలీవుడ్ ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ బ్యాచిలర్ షిప్ పై చాలా కాలంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ దేవీ పెళ్లెప్పుడు? అన్నది నిరంతరం హాట్ టాపిక్. అందాల కథానాయిక ఛార్మితో ప్రేమలో పడ్డాడని త్వరలో పెళ్లి చేసుకుంటాడని అప్పట్లో తామరతంపరగా పుకార్లు షికారు చేశాయి. అయితే అవేవీ నిజం కాలేదు. ఆ తర్వాత దేవీశ్రీ వేరొక అమ్మాయితో ప్రేమలో పడ్డాడని ఈసారి పెళ్లి ఖాయం అన్న ముచ్చటా పరిశ్రమని వేడెక్కించింది. `రంగస్థలం` చిత్రంలో నటించిన పూజిత పొన్నాడ అందచందాలకు ఫిదా అయిపోయిన దేవీ తనతో ప్రేమలో పడిపోయారని.. ఇక ఓ ఇంటివాడైపోవడం ఖాయమేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగింది.

అయితే ఇది కూడా రూమరేనని ఆ తరవాత తేలింది. దేవీ ఇంకా స్టిల్ బ్యాచిలర్. అయితే అతడి ఇంట్లో మాత్రం పెళ్లి బాజా మోగింది. దేవీశ్రీ సోదరుడు సాగర్ ఇటీవలే దగ్గర బంధువు అయిన డాక్టర్ మోనికను పెళ్లాడారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలో దేవీశ్రీ ఎంతో వైబ్రేంట్ గా కనిపించాడు. ఈ గ్రూప్ ఫోటోని షేర్ చేసిన దేవీశ్రీ ప్రసాద్ జూన్ 19న ఈ వివాహం జరిగిందని తెలిపారు. అయితే అదే రోజు తమ తల్లిదండ్రుల వెడ్డింగ్ యానివర్శరీ అని వెల్లడించాడు.

అయితే ఈ వార్త అంత ఆలస్యంగా ఎందుకు చెప్పినట్టు? జూన్ 19న వివాహం అంటే రెండు వారాల తర్వాత ఈ ఫోటోని షేర్ చేయడమేంటి? అదంతా సరేలే అని లైట్ తీస్కుంటే .. ఇంతకీ దేవీశ్రీ ఓ ఇంటివాడయ్యేదెపుడు? అన్నది తేలాల్సి ఉంది. తనకు నచ్చిన అమ్మాయికి ప్రోపోజల్ పెట్టేందుకు ఎందుకింతగా ఆలోచిస్తున్నాడు? అన్నది దేవీనే చెబుతాడేమో చూడాలి. రాక్ స్టార్ ప్రస్తుతం మహేష్ నటిస్తున్న `సరిలేరు నీకెవ్వరు` .. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.