చిరు సినిమాపై నాగబాబు అసంతృప్తి.. షాక్ లో అభిమానులు

మెగాస్టార్ చిరంజీవి విషయంలో నాగబాబు కు ఉన్న అసంతృప్తి ని బయటకు చెప్పుకొచ్చాడు. ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలు చేసిన చిరంజీవికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రాలేదన్న అసంతృప్తి ఇప్పటికీ ఉందని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా మీడియా తో ముచ్చటించిన నాగబాబు తన మనసులోని ఆవేదనను వ్యక్తం చేసారు.

‘‘అన్నయ్య వేసిన బాటలోనే మేమంతా కొనసాగుతున్నాం. మెగా కుటుంబం నుంచి వచ్చే వాళ్లందరూ ఎంతో కష్టపడతారు. తమ వెనుక మెగా పవర్‌ ఉందని అస్సలు అనుకోరు. వరుణ్‌ సినిమాల్లోకి వస్తానన్నప్పుడు ‘చిరంజీవిగారి నుంచి వారసత్వంగా వచ్చేది ఒక్కటే ఉంది. అది తీసుకుంటేనే నువ్వు సక్సెస్‌ అవుతావు’ అని చెప్పా. ‘ఏంటీ నాన్న అది’ అని వరుణ్‌ అడిగితే, ‘హార్డ్‌వర్క్‌, డెడికేషన్‌’ అని చెప్పా. అన్నయ్య విషయంలో ఇప్పటికీ నాకు ఒక అసంతృప్తి ఉంది. అదేంటంటే.. అన్నయ్యలాంటి స్టార్‌కి ఒక్కసారి కూడా ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డు రాలేదేనని బాధపడుతుంటా.

ఎందుకంటే ఎన్నో మంచి సినిమాలు చేశారు. ‘రుద్రవీణ’కు రావాల్సింది. కానీ, ఇవ్వలేదు. ఈసారి ‘సైరా: నరసింహారెడ్డి’తో ఆ కోరిక తీరుతుందని అనుకుంటున్నా. నేను సినిమా చూశా కూడా. అద్భుతంగా ఉంది. అభిమానులు ఏ అంచనాలతో ఉన్నారో.. వాటికి ఏమాత్రం తగ్గదు. వయసు పెరుగుతున్నా ఆయన కష్టపడేతత్వం, నిబద్ధత తగ్గలేదు. ముఖ్యంగా సినిమాలో ఫైట్స్‌ చూస్తుంటే ఒళ్లు గగురుపొడుస్తోంది. ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రావాలని కోరుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చారు.