చిరంజీవి దెబ్బ గట్టిగానే తగిలింది.. అలిగి వెళ్ళిపోయిన రకుల్

ఒక సినిమా నిర్మాణం జరుపుకొని విడుదల కావాలంటే అందులో ఖచ్చితంగా మేనేజర్ల వాటా చాలా ఉంటుంది. సినిమా ఆఫీస్ తీసుకున్నప్పటి నుండి సినిమా విడుదల అయ్యి చివరి రూపాయి లెక్క తేలేదాక మేనేజర్లు పాత్ర పెద్ద స్థాయిలోనే ఉంటుంది. తాజాగా టాలీవుడ్ కి చెందిన మేనేజర్ల రజతోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర స్టేడియంలో ఆదివారం ఘనంగా జరిగింది.ఇందులో టాలీవుడ్ కి చెందిన 12 మంది హీరోయిన్ల యొక్క లైవ్ డాన్స్ ఫెర్ఫామెన్స్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హీరోయిన్ రకుల్ కూడా స్టేజి షో చేయటానికి ఒప్పందం చేసుకుంది. దేవిశ్రీ ప్రసాద్ షో తర్వాత ఆర్డర్ ప్రకారం రకుల్ షో జరగాలి,

అయితే అదే సమయానికి మెగాస్టార్ చిరంజీవి రావటంతో ఒక్కసారిగా కోలాహలం స్టార్ట్ అయ్యింది. స్టేజి మీద ఏమి జరుగుతుంది అనేది ఎవరు కూడా పట్టించుకునే స్థితిలో లేరు.ఇక ఆ తర్వాత అతిధుల స్పీచ్ కార్యక్రమం మొదలైంది, అవి ముగిసిన వెంటనే చిరంజీవిని స్టేజి మీదకి పిలిచారు, ఈ క్రమంలో రకుల్ డాన్స్ పర్ఫామెన్స్ షో క్యాన్సిల్ అయ్యింది. దీనితో రకుల్ నిర్వాహకుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ షో మధ్యలో నుండి వెళ్లిపోయిందని సమాచారం. ఇలాంటి కార్యక్రమాల విషయంలో ఎంతో నిక్కచ్చిగా, టైం టు టైం అన్ని పాటిస్తూ ఉండాలి, ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగిన ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటాయి.