చిల్డ్రన్స్ డే స్పెషల్.. తొందరపాటుతో దొరికిపోయిన అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల… వైకుంఠపురములో…’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా వస్తోన్న ఈ సినిమాకు వీలైనంత ఎక్కువ ప్రచారం కల్పించాలని బన్నీ చూస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటి వరకు రెండు పాటలను విడుదల చేశారు. ‘సామజవరగమన’ సాంగ్ క్లాస్‌గా.. ‘రాములో రాముల’ సాంగ్ మాస్‌గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘సామజవరగమన’ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయిపోయింది.

అయితే, ప్రస్తుతం మూడో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. బాలల దినోత్సవం సందర్భంగా రేపు (నవంబర్ 14న) ‘ఓఎంజీ డాడీ’ అంటూ సాగే పాట టీజర్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు ప్రకటించాలని ప్లాన్ చేశారు. అయితే, సాయంత్రం రావాల్సిన అనౌన్స్‌మెంట్ ముందుగానే వచ్చేసింది. దీనికి కారణం అల్లు అర్జున్. ఆయనే తొందరపడ్డారో, లేదా ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాండిల్ చేస్తోన్న వ్యక్తి అత్యుత్సాహమో తెలీదు కానీ.. రేపు ‘ఓఎంజీ డాడీ’ సాంగ్ టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు ఈరోజు ఉదయం ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ చేసిన కాసేపటికే డిలీట్ కూడా చేసేశారు. కానీ, అప్పటికే చాలా మంది స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నారు.

ఇప్పుడు ఈ విషయం ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. మొత్తం మీద విషయం ఏమిటంటే.. చిల్ట్రన్స్ డే సందర్భంగా రేపు ‘ఓఎంజీ డాడీ’ సాంగ్ టీజర్ వస్తోంది. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు ‘ఓఎంజీ డాడీ’ సాంగ్ టీజర్‌ను విడుదల చేస్తున్నారు.