సీన్ రివర్స్ : బాబు దెబ్బ.. జనసేన అబ్బ!

టిడిపి తరఫున తమకు ఆశించిన టిక్కెట్లు దక్కకపోవడంతో కొందరు అభ్యర్థులు ఆ పార్టీని వీడి జనసేనలోకి చేరారు. తనను నమ్మి వచ్చారన్న అభిప్రాయంతో పవన్ వారికి ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు. కానీ లాస్ట్ మినట్‌లో చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలతో పరిస్థితులు మారిపోయాయి. జనసేన తరఫున నామినేషన్స్ వేసిన వారు ఒక్కొక్కరుగా యూ-టర్న్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులు తిరిగి టిడిపి గూటికి చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం!

టిడిపి నుంచి ఎంపీ సీటు దక్కలేదన్న ఆగ్రహంతో ఎస్పీవై రెడ్డి జనసేనలోకి జంప్ అయ్యారు. రాజకీయ అనుభవం దృష్ట్యా ఆయనకు ఎంపీ సీటు ఇవ్వడంతోపాటు కూతురు, అల్లుడికి కూడా మరో రెండు టిక్కెట్లిచ్చింది జనసేన! కానీ… సీన్‌లోకి చంద్రబాబు ఎంటరై ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతో ఎస్పీవై రెడ్డి సహా కూతురు, అల్లుడు ఇద్దరూ జనసేన తరఫున వేసిన నామినేషన్స్ విత్‌డ్రా చేసుకోవడానికి రెడీ అయ్యారు. తాజాగా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా కూడా అదే నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం!

టిడిపి టిక్కెట్ ఇవ్వలేదనే కారణంతో… గుప్తాను జనసేనలోకి చేరాల్సిందిగా జెసి దివాకర్‌రెడ్డి సూచించారు. ఆయన సూచన మేరకు గుప్తా జనసేనలోకి చేరి, నామినేషన్ కూడా వేశారు. ప్రచారానికి కూడా సిద్ధమయ్యారు. కానీ.. బాబు రంగంలోకి దిగి జేసితో చర్చలు జరిపి, గుప్తాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో గుప్తా నామినేషన్ వెనక్కు తీసుకునేలా ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. గుంతకల్లు టిడిపి అభ్యర్థి విజయానికి కృషి చేస్తే… రాజకీయంగా మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.

మధుసూదన్ గుప్తా ఇంతవరకూ తన నామినేషన్ వెనక్కు తీసుకోలేదు కానీ… పరిస్థితులు గమనిస్తుంటే ఆయన యూ-టర్న్ తీసుకునేటట్టు కనిపిస్తోంది. జనసేన పక్కాగా విజయం సాధిస్తుందనే నమ్మకం లేదు. టిడిపికి విజయావకాశాలు మెండుగానే ఉన్నాయి. కాబట్టి… టిక్కెట్ దక్కకపోయినా ఏదో ఒక హోదా దక్కుతుందనే ఉద్దేశంతో ఆ పార్టీలోకి తిరిగి వెళ్ళిపోవచ్చు. ఇదే జరిగితే… జనసేనకు భారీ నష్టం వాటిల్లక తప్పదు.