బిగ్ బాస్ నటికి లైంగిక వేధింపులు ..

అవకాశాలు ఇస్తామంటూ నటీమణులను వేధింపులు ఒక ఎత్తు అయితే.. అయినోళ్ల కారణంగా దారుణమైన హింసను ఎదుర్కొనే చేదు అనుభవాలు మరికొందరికి ఎదురవుతూ ఉంటుంది. కన్నడ నటిగా.. బిగ్ బాస్ కన్నడ కంటెస్టెంట్ గా సుపరిచితురాలు జయశ్రీ రామయ్య తాజాగా వార్తల్లోకి వచ్చారు. ఆస్తి కోసం తన మేనమామ తనను శారీరకంగా.. మానసికంగా హింసిస్తున్నాడంటూ ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది.

నటిగా సుపరిచితమే కాదు.. మంచి డ్యాన్సర్ గా జయశ్రీకి పేరుంది. తనతో పాటు.. తన తల్లిని కూడా మేనమామ గిరీశ్ వేధింపులకు గురి చేస్తున్నాడంటూ సీకె అచ్చుకట్టె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని హనుమంత నగర్ లో ఉన్న తమ ఇంటికి అర్థరాత్రి వేళ వచ్చి గొడవపడ్డారని.. తన తల్లిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారని వాపోయారు. తాను ధరించే వస్త్రాల మీద కూడా దారుణమైన వ్యాఖ్యలు చేస్తాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.

జయశ్రీ కంప్లైంట్ ను తీసుకున్న పోలీసులు తొలుత ఈ విషయం మీద విచారిస్తామన్నారు. నటి కంప్లైంట్ నేపథ్యంలో ఆమెతో పాటు గిరీశ్ ను కూడా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ప్రాథమిక విచారణ అనంతరం కేసు రిజిస్టర్ చేయనున్నట్లు పోలీసులు చెబుతున్నారు.