బిగ్ బాస్ ట్విస్ట్.. అలీ రెజా రీఎంట్రీ..?

ఖచ్చితంగా ఫైనలిస్ట్‌ అవుతాడని అనుకున్న అలీ రెజా ఇంటర్వెల్‌ పాయింట్‌లో ఎగ్జిట్‌ అవడంతో చాలా మంది డిజప్పాయింట్‌ అయ్యారు. ముఖ్యంగా హౌస్‌మేట్స్‌ అయితే వలవలా ఏడ్చేసి టీవీ సీరియల్‌ని మించిన మెలోడ్రామా పండించారు. అలీ బాగా ఆడినా కానీ కంట్రోల్‌ చేసుకోలేని ఆవేశం, శ్రీముఖికి ఆయుధంగా మారిన వైనం నచ్చక అతడికి ఓట్‌ చేయలేదు.అయితే ఎంత ఓట్లు పడకపోయినా రవికృష్ణ కంటే అలీనే ముందుంటాడని అనుకున్నారు. కానీ హౌస్‌లో ఇంకా వితిక, మహేష్‌లాంటి వాళ్లు వుండగా, టాస్క్‌లలో 110% ఇచ్చే అలీ ఎలిమినేట్‌ అవడం ఆడియన్స్‌ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

దీంతో ఈ ఫీడ్‌బ్యాక్‌ని దృష్టిలో పెట్టుకుని మరోసారి పాత కంటెస్టెంట్స్‌లో ఎవరైనా ఫేవరెట్‌ కంటెస్టెంట్‌ని తిరిగి హౌస్‌లోకి పంపించేందుకు బిగ్‌బాస్‌ ఓటింగ్‌ నిర్వహించనున్నాడట.గత సీజన్‌లో ఇలాగే తేజస్వి అవుట్‌ అయినపుడు ఆమెని తిరిగి పంపించాలని చూసారు కానీ కౌశల్‌ ఆర్మీ దెబ్బకి బిగ్‌బాస్‌ తరం కాలేదు. ఈసారి అలాంటివేం లేవు కాబట్టి అలీని పంపడం ఈజీ అవుతుంది. ఈవారం నామినేషన్‌ ప్రాసెస్‌ మామూలుగా జరిగినా కానీ ఓటింగ్‌ అయితే రీఎంట్రీ కోసమే జరుగుతుందని వినిపిస్తోంది. ఒకవేళ ఓటింగ్‌ సిస్టమ్‌ లేకపోయినా కానీ అలీ రెజాని వైల్డ్‌ కార్డ్‌గా తిరిగి పంపించడానికి ప్రణాళిక అయితే వుందని మాత్రం తెలిసింది.