ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఏపీ, తెలంగాణల్లో ప్రీమియర్స్ లేనట్లే..?

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా రిలీజ్ కు సమయం రోజురోజుకు దగ్గర పడుతున్నకొద్దీ, ఆయన ఫ్యాన్స్ లో సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే అతృతతో మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్ , వీడియో సాంగ్స్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోవడంతో సినిమాపై కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ లోనే కాక సినిమా ప్రేక్షకుల్లోనూ విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అదీకాక బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత వస్తున్న ప్రభాస్ సినిమా కావడంతో, తెలుగు సహా మిగతా ఇతర భాష ప్రేక్షకులు కూడా ప్రభాస్ ను, న్యూ స్టయిల్లో చూడాలని ఎదురు చూస్తున్నారు.

ఇక ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసేలా ఇప్పటికే నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్ పక్కాగా ప్లాన్ చేసినట్లు సమాచారం. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్, ప్రభాస్ ప్రక్కన జోడి కడుతోంది. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ కు సంబందించి నేడు బయటకొచ్చిన ఒక వార్త ప్రభాస్ ఫ్యాన్స్ ను తీవ్ర కలవర పెడుతోంది. అదేమిటంటే, సాహో అందరికంటే ముందుగా ప్రీమియర్ షో ల ద్వారా చూద్దామని భావించిన మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆ అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు విపరీతమైన హైప్ ఉన్న కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ ప్రీమియర్ షోలను రద్దు చేసి, ఆంధ్రలో తెల్లవారుఝామున 3 గంటలకు తొలి ఆట, అలానే తెలంగాణాలో అయితే ఉదయం 7 గంటలకు తొలి ఆట మొదలెట్టడం జరుగుతుందని సమాచారం అందుతోంది.

ఇక ఈ న్యూస్ బయటకు వచ్చిన తరువాత, కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి సినిమాకు కూడా ప్రీమియర్ షోలు రద్దు చేయడం జరిగిందని, ఇకపై రాబోయే రోజుల్లో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలకు కూడా ప్రీమియర్స్ ఉండకపోవచ్చని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయమై సాహో యూనిట్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ వార్తను పూర్తిగా విశ్వసించలేమని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి సాహో కు ప్రీమియర్ షోలు ఉన్నాయో, లేవో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే…!!