బిగ్ బాస్ ను అలా అంటావా..? జాఫర్ పై మండి పడుతున్న నెటిజన్స్

బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టంట్ గా పాల్గొన్న జర్నలిస్ట్ జాఫర్.. హౌస్ లోకి వెళ్లిన రెండు వారాలకే బయటకి వచ్చేశారు. షోలో ఉన్నన్ని రోజులు బాబా భాస్కర్ తో కలిసి జాఫర్ చేసిన కామెడీ ఆడియన్స్ ని మెప్పించింది. ఇది ఇలా ఉండగా.. తాజాగా బిగ్ బాస్ షోపై జాఫర్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాఫర్ కి బిగ్ బాస్ షో ఎలా జరిగిందనే ప్రశ్న ఎదురైంది. దానికి జాఫర్.. ‘కంటెస్టంట్లు ఎలా ఆడారు..? హౌస్ లో అనుభవాలేంటి..? ఇలా వీటిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందా..?’ అని ఎదురు ప్రశ్నించారు. దీనివల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా..? అంటూ వ్యాఖ్యలు చేశారు.

పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకోవడం మనిషి వీక్ నెస్ అని.. ఆ వీక్ నెస్ ని ఇలాంటి షోలు క్యాష్ చేసుకుంటున్నాయని జాఫర్ తన అభిప్రాయాన్ని చెప్పారు. బిగ్ బాస్ ప్రసారమావుతోన్న ఏడు రాష్ట్రాలతో పోలిస్తే బిగ్ బాస్ తెలుగు సీజన్ 3కి విపరీతమైన రేటింగ్స్ వచ్చినట్లు నిర్వాహకులు ప్రకటించారని జాఫర్ గుర్తు చేశాడు. ఇదేమీ గొప్ప విషయం కాదని.. కేవలం బిజినెస్ గేమ్ అని తీసిపారేశారు.ఇలాంటి గేమ్ ల వలన టీఆర్పీ రేటింగులు వస్తాయి కాబట్టి నిర్వాహకులకు లాభం, కంటెస్టంట్లకు లాభమని అన్నారు. ఎందుకంటే పారితోషికంతో పాటు పాపులారిటీ కూడా పెరుగుతుందని.. ఎంత బాగా పాపులర్ అయితే అంతగా తాను చేసే డిబేట్స్ ఎక్కువమందికి రీచ్ అవుతాయనే స్వార్ధంతోనే బిగ్ బాస్ షోకి వచ్చినట్లు జాఫర్ తెలిపాడు. బిగ్ బాస్ షో కోసం చర్చలు అనవసరమని భావించాను కాబట్టే ఏ డిబేట్ లో పాల్గొనలేదని చెప్పారు.

అయితే జాఫర్ చేసిన ఈ కామెంట్స్ కి సోషల్ మీడియాలో వ్యతిరేకత ఏర్పడుతోంది. బిగ్ బాస్ షోపై చర్చలు అనవసరమని చెప్పిన జాఫర్.. షో ముగిసిన తరువాత బాబా భాస్కర్ ని ఎందుకు ఇంటర్వ్యూ చేశారని ట్రోల్ చేస్తున్నారు. అతను చేస్తే కరెక్ట్.. మిగతా వాళ్లు చేస్తే తప్పా అంటూ మండిపడుతున్నారు. బిగ్ బాస్ షో ప్రసారమైనంత కాలం సైలెంట్ గా ఉండి ఇప్పుడేమో ఇదొక వేస్ట్ షో అంటూ మాట్లాడడం కరెక్ట్ కాదని జాఫర్ కి క్లాసులు పీకుతున్నారు.