RRR ను వదలని బాహుబలి నిర్మాత.. 100 కోట్ల ఆఫర్ రిజెక్ట్

బాహుబలి సీరిస్ తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం RRR. ఈ చిత్రంలో తొలిసారి మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొన్ని అవాంతరాల తర్వాత ఈ మధ్యనే జోరందుకున్నది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి డీవీవీ దానయ్య విషయంలో ఓ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఆ వార్త ఏమిటంటే..

RRR చిత్రాన్ని నిర్మాత డీవీవీ దానయ్య సుమారు రూ.450 కోట్లతో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా సెట్ల నిర్మాణంలోను, గ్రాఫిక్ పనులు విషయంలోనూ, అలాగే లొకేషన్ల ఎంపికలోనూ తిరుగులేని నిర్ణయాలు తీసుకొంటున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌పై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కన్నేశాడని ఆ వార్త సమాచారం. బాహుబలి సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినట్టే.. RRR సినిమాను మరో క్రేజీగా మలిచే ఉద్దేశంతో నిర్మాత దానయ్యతో చర్చలు జరిపారట. RRR సినిమాను సుమారు రూ.550 కోట్లకు అప్పగించమని శోభు యార్లగడ్డ ఓ ప్రపోజల్‌ను డీవీవీ ముందు పెట్టినట్టు తెలుస్తున్నది. అంతే దాదాపు రూ.100 కోట్లు టేబుల్ ప్రాఫిట్ కనిపించే విధంగా శోభు బేరం ఆడినట్టు తెలుస్తున్నది. అయితే డీవీవీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది.

RRR చిత్రం 1800 నేపథ్యంగా తెరకెక్కుతున్నది. ఆ కాలంలో జన్మించి ఆంధ్రాలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు, అలాగే తెలంగాణ ప్రాంతంలో హక్కుల కోసం పోరాడిన కొమురం భీమ్ పాత్రల్లో రాంచరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. వీరిద్దరి పాత్రలను అద్భుతంగా డిజైన్ చేస్తున్నట్టు ఇటీవల రాజమౌళి వెల్లడించారు.RRR చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ ఇతర భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బారతీయ అన్ని భాషల్లోనూ విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఇటీవల ఎస్ఎస్ రాజమౌళి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆలియాభట్, జగపతి బాబు, అజయ్ దేవగన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం 2020 జూలై 30న విడుదలకు సిద్దమవుతున్నది.