అశ్వథ్థామ అచ్చం రాక్షసుడిలా వుందేంటి..?

ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు అంటారన్నట్లు.. ఇండస్ట్రీలో కూడా సినిమాలను పోలిన సినిమాలు చాలానే ఉంటాయి. ఇప్పుడు నాగశౌర్య హీరోగా నటిస్తున్న అశ్వథ్థామను చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైందిప్పుడు. ఇది చూస్తుంటే తెలియకుండానే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమా గుర్తుకొస్తుంది. అందులో ఇందులో లైన్ మాత్రం సేమ్ టూ సేమ్ అనిపిస్తుంది. పైగా ఈ చిత్ర కథ రాసింది కూడా నాగశౌర్య కావడం విశేషం. ట్రైలర్ చూస్తుంటే సేమ్ టూ సేమ్ అమ్మాయిలు కిడ్నాప్.. ఆ తర్వాత చంపడం.. క్లూ లేకుండా పోలీసులు చేతులెత్తేయడం.. అలాంటి సమయంలో హీరో వచ్చి దాన్ని చేధించడం అన్నీ రాక్షసుడు సినిమాను పోలి ఉన్నాయి.కథనంలో భిన్నంగా ఉంటుందా అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది కానీ ట్రైలర్ మాత్రం రాక్షసుడు సినిమాను గుర్తుకు తెస్తుందనేది కాదనలేని వాస్తవం.

 

ఇప్పటి వరకు ఈ హీరో ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈయనకు ప్రత్యేకంగా మార్కెట్ తీసుకొచ్చిన సినిమా మాత్రం ఛలో. 2018లో తొలి బ్లాక్ బస్టర్ కూడా ఈ సినిమానే.అప్పటి వరకు అడపాదడపా వస్తున్న సమయంలో ఛలో ఒక్కసారిగా ఈయన కెరీర్‌ను పైకి తీసుకొచ్చింది. ఆ సినిమా కథ రాసింది కూడా తానే అని ఈ మధ్యే చెప్పాడు శౌర్య. ఇక ఇప్పుడు అశ్వథ్థామ సినిమాతో వస్తున్నాడు.జనవరి 31న విడుదల కానుంది ఈ చిత్రం. ఈ సినిమాకు కథ అందించింది నాగశౌర్య. ముందు టైటిల్స్‌లో ఈయన పేరు చూసి అంతా షాక్ అయ్యారు కానీ ఇప్పుడు ఈ కుర్ర హీరో మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. తనను అంతా లవర్ బాయ్ అంటున్నారు కానీ తాను రఫ్ అంటున్నాడు ఈయన. అందుకే ఛలో చేసానని.. ఇప్పుడు అశ్వథ్థామ సినిమా చేస్తున్నానని చెప్పాడు నాగశౌర్య. ఇందులో కూడా ఓ రాక్షసుడు.. అతన్ని చంపడానికి హీరో పడే పాట్లు కథగా ఉంది. మరి ఈ చిత్రంతో శౌర్య మాస్ ఇమేజ్ తెచ్చుకుంటాడా లేదా అనేది చూడాలిక.